Due
-
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్‌ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్‌లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
ఆ పుస్తకం 100 ఏళ్లకు.. లైబ్రరీకి తిరిగి చేరుకుంది!
లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు "ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ" అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది. కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది. (చదవండి: అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!) -
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్‌పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్‌పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
ల్యాంకో ప్లాంటులోనికి వెళ్లనివ్వటం లేదు
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో ఇన్ఫ్రాకు చెందిన ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ (ఎల్‌బీపీఎల్) దివాలా ప్రక్రియలో భాగంగా ఒడిశాలో ఉన్న ఆ కంపెనీ ఆస్తుల స్వాధీనానికి వెళ్లిన తనను స్థానిక కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) యు.బాలకృష్ణభట్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ జుడీషియల్ సభ్యుడు కె.అనంత పద్మనాభ స్వామి... బాలకృష్ణ భట్‌కు తగిన రక్షణ కల్పించాలంటూ ఒడిస్సా, డెంకనల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఎల్‌బీపీఎల్ ఆస్తుల స్వాధీనానికి వెళ్లినప్పుడు భట్‌కు తగిన రక్షణ కల్పించాలని స్వామి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎల్‌బీపీఎల్ తమకు రూ.1428.33 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని, అయితే ఆ బకాయిలను చెల్లించని నేపథ్యంలో ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ట్రైబ్యునల్... ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతులు మంజూరు చేసింది. పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ముంబైకి చెందిన బాలకృష్ణ భట్‌ను నియమించింది. దివాలా ప్రక్రియలో భాగంగా ఆయన ఒడిశా, డెంకనల్ జిల్లా, కర్గప్రసాద్, కురుంటి గ్రామాల్లో ఎల్బీపీఎల్కు ఉన్న ఆస్తుల స్వాధీనానికి వెళ్లారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. చేసిన పనులకుగాను ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ స్థానిక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు వేరేవారెవ్వరినీ ఆ కంపెనీలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ భట్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కంపెనీ ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఆస్తులు తదితర సామగ్రి విలువను మదింపు చేస్తే తప్ప దివాలా ప్రక్రియ ముందుకు సాగదని, అందువల్ల తనకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్, భట్ కోరిన ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. -
పింఛన్ రాలేదని ఆగిన వృద్ధుడి గుండె
-
పోలీసుల వేధింపులతో వ్యక్తి మృతి
-
విద్యతోనే అభివృద్ధి
గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల ఐలాపురం (పినపాక): విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఐలాపురం గ్రామం వద్దనున్న మినీ గురుకులంలో గిరిజన బాలికల ఇంగ్లిష్ మీడియం పాఠశాలను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం విద్య అవసరమని అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు త్వరలో అనుమతులు వస్తాయన్నారు. ‘మిషన్ భగరధ’తోపాటు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా పినపాక నియోజకవర్గానికి సాగు నీరు అందించనున్నట్టు చెప్పారు. రూ.400 కోట్లతో పర్ణశాల–చినరావిగూడెం గ్రామాల మధ్య త్వరలోనే వంతెన నిర్మించనున్నట్టు తెలిపారు. బూర్గంపాడు–ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించనున్నట్టు తెలిపారు. గిరిజనుల బాలికల పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, కాస్మొటిక్స్ అందజేశారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ, పాల్వంచ ఆర్డీఓ రవీంద్రనాధ్, మణుగూరు డీఎస్పీ అశోక్ కుమార్, పినపాక వైస్ ఎంపీపీ దాట్ల వాసుబాబు, సర్పంచులు కుంజా వెంకటేశ్వర్లు, తోలెం కళ్యాణి, ఇర్పా సారమ్మ, ఎంపీటీసీ సభ్యులు కొండేరు రాము, గొంది లక్ష్మీదేవి, ఎంపీడీఓ గడ్డం రమేష్, తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంఈఓ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థునికి నోట్ బుక్స్, దుస్తులు అందజేస్తున్న మంత్రి తుమ్మల, పక్కన ఎమ్మెల్యే పాయం, జడ్పీ చైర్పర్సన్ కవిత -
డబ్బు కోసం రైతుని కరెంట్ స్థంభానికి కట్టేశాడు
- రెండేళ్లుగా తీర్చలేకపోయిన పది వేల రూపాయల బాకీ - తీర్చేదాకా వదిలేది లేదంటూ తాడుతో బంధించిన వ్యాపారి - రైతన్నపై పశువుల వ్యాపారి అమానుషం వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా) : కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు ఓ రైతును మూడు గంటల పాటు విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పశువుల మార్కెట్లో ఆదివారం చోటుచేసుకుంది. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన వడ్డే యాదయ్య (38) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ధారూరు మండల కేంద్రానికి చెందిన ఓ పశువుల వ్యాపారి వద్ద కాడెద్దులు కొనుగోలు చేశాడు. వీటి ధర అప్పట్లో రూ. 27 వేలు. ఇందులో రూ. 17 వేలు రెండు విడతల్లో తీర్చాడు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారికి రైతు యాదయ్య మిగిలిన రూ. 10 వేలు చెల్లించలేకపోయాడు. ఇదిలా ఉండగా.. ఆదివారం మిత్రుడి కోరిక మేరకు రైతు యాదయ్య వికారాబాద్ పశువుల సంతకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారికి రైతు వడ్డే యాదయ్య తారసపడ్డాడు. అంతే.. మరో ఆలోచన లేకుండా రైతును తాడుతో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. 'రెండేళ్లుగా నీకోసమే ఎదురు చూస్తున్నా.. అప్పు తీర్చమని మీ ఇంటికి వస్తే ఇబ్బందుల పాల్జేశావు. డబ్బు ఇవ్వందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లలేవు. నిన్ను ఎవరు విడిపిస్తారో చూస్తాం' అంటూ హెచ్చరించాడు. కరువు పరిస్థితుల్లో తీసుకున్న అప్పు తీర్చులేకపోయానని, పనిచేసైనా అప్పు తీరుస్తానని, కొంత సమయం కావాలని రైతు వడ్డే యాదయ్య వ్యాపారిని అభ్యర్థించాడు. అయితే.. సమాచారం అందుకున్న 'సాక్షి' అక్కడికి చేరుకుని వ్యాపారితో మాట్లాడింది. రైతును పోలీసులకు అప్పగించాలని, లేదంటే కేసు అవుతుందని చెప్పడంతో ఎట్టకేలకు రైతును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.