ల్యాంకో ఆస్తుల అమ్మకం! | NCLT orders liquidation of Lanco Infratech | Sakshi
Sakshi News home page

ల్యాంకో ఆస్తుల అమ్మకం!

Published Tue, Aug 28 2018 12:42 AM | Last Updated on Tue, Aug 28 2018 1:38 PM

NCLT orders liquidation of Lanco Infratech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో  ల్యాంకో ఇన్‌ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్‌) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది.

ఈ మేరకు ట్రిబ్యునల్‌ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) ఉన్న సావన్‌ గొడియావాలాను ల్యాంకో ఇన్‌ఫ్రా లిక్విడేటర్‌గా కూడా నియమిస్తున్నట్లు మురళీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

‘‘ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం కొన్నసాగుతున్న ల్యాంకో ఇన్‌ఫ్రా బోర్డు, ఇతర మేనేజ్‌మెంట్, భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. అవన్నీ లిక్విడేటర్‌కు బదిలీ అవుతాయి. లిక్విడేటర్‌ ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారు. లిక్విడేషన్‌ మొదలైన నాటి నుంచి 75 రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది’’ అని మురళి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

ఐడీబీఐ పిటిషన్‌తో దివాలా ప్రక్రియ మొదలు
తమ నుంచి రుణంగా తీసుకున్న రూ.3608 కోట్లను ల్యాంకో ఇన్‌ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకని ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు చెప్పగా... అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్‌ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్‌... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్‌ గొడియావాలాను నియమించింది.

అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఏడు కంపెనీలు తమ ఆసక్తిని తెలియచేస్తూ రుణ పరిష్కార ప్రణాళికలు సమర్పించాయి. ఇందులో త్రివేణి ఎర్త్‌మూవర్స్, ఇంజన్‌ క్యాపిల్‌ గ్రూపులు సమర్పించిన ప్రణాళికలు మినహా మిగిలిన కంపెనీల ప్రణాళికలు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ రుణ ప్రణాళికలో ఎలాంటి లోపాలూ లేకపోవటంతో దాన్ని రుణదాతల కమిటీ ముందు ఉంచారు.

ఓటింగ్‌లో త్రివేణి ప్రణాళికకు 15.53 శాతం రుణదాతలే ఆమోద ముద్ర వేశారు. దీంతో ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతించాలంటూ సావల్‌ గొడియావాలా ఎన్‌సీఎల్‌టీ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్‌ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనల ప్రకారం రుణ పరిష్కార ప్రణాళికకు 66 శాతం మంది రుణదాతల ఆమోదం కావాలి.

కానీ త్రివేణి ప్రతిపాదనకు 15.53 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అందుకని ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతినిస్తున్నాం’’ అని ఉత్తర్వుల్లో వివరించారు. మరోవంక ల్యాంకో కోసం పవర్‌ మెక్‌ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. పలు అభ్యర్థనలతో ల్యాంకో ఇన్‌ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణ సెప్టెంబర్‌ 12కి వాయిదా పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement