ఐపీవోకు న్యూ ఇండియా అష్యూరెన్స్
ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా షేర్లు జారీ చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి తుది అనుమతులు వచ్చిన వెంటనే పబ్లిక్ ఇష్యూకి రావాలని భావిస్తున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయిదు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో ప్రస్తుతం 100 శాతంగా ఉన్న వాటాలను దశలవారీగా 75 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ ఆర్‌ఈ సంస్థల ఐపీవోలు ఉండనున్నాయి. ఆ తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు జాబితాలో ఉన్నాయి.