ఇన్ఫీని గాడిలో పెట్టడానికే వచ్చా: నిలేకని
న్యూఢిల్లీ : వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడానికి ఇన్ఫోసిస్ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. గురువారం ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నిలేకని ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవస్థాపకులకు, కంపెనీకి మధ్య స్థిరత్వం సంపాదించడమే లక్ష్యంగా తాను ఇన్ఫీలోకి అడుగుపెట్టినట్టు నిలేకని చెప్పారు. కంపెనీని గాడిపెట్టిన అనంతరమే తాను ఇన్ఫీ నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తన పాత్ర బోర్డు పర్యవేక్షణ, పాలన, పనితీరు పరంగా ఉంటుందన్నారు.
విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఆ పదవిలోకి తీసుకురాబోయే కొత్త సీఈవోగా కోసం కంపెనీ వెలుపల, లోపల వ్యక్తులను వెతుకుతున్నామని చెప్పారు. కొత్త సీఈవో అందరి వాటాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ.. టెక్నాలజీ పరంగా బలమైన పట్టు ఉండాలన్నారు. కొత్త సీఈవో ఎంపిక కోసం సెర్చ్ కమిటీని త్వరలోనే నియమిస్తామన్నారు.
ఇన్ఫోసిస్ బోర్డుతో పనిచేసే కంపెనీ అని, వాటాదారులందరినీ సంప్రదించిన తర్వాత, కొన్ని రోజుల్లోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని నిలేకని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్‌చైర్మన్‌గా తన ఎంపిక, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొన్నారు. అవసరమైనంత కాలం ఇక్కడే ఉంటానని, ఒక్కసారి నా బాధ్యత నెరవేరాక కంపెనీ నుంచి వైదొలుగుతానని ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్‌లో చెప్పారు. నారాయణమూర్తికి తాను గొప్ప ఆరాధకుడనని కూడా చెప్పారు. భారత కార్పొరేట్ గవర్నెన్స్‌కు మూర్తి తండ్రిలాంటి వారని మూర్తి అభివర్ణించారు
పనాయా డీల్‌పై స్పందించిన నిలేకని, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటానని, స్వల్పకాలికంగా కంపెనీ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని చెప్పారు. క్లయింట్స్‌తో, డీల్స్‌తో సంస్థ చేసుకున్న న్యాయ ఒప్పందాలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. ''ఇన్ఫోసిస్‌కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. క్లయింట్లు, షేర్‌హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను'' అని నిలేకని చెప్పారు.