మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ కొత్త పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘పెరుగుతున్న ఆదాయ బీమా పథకం’ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ వ్యవధి 12-24 ఏళ్లు. 14-60 ఏళ్ల వయస్సు వారు అర్హులు. ఈ పథ కాన్ని పొదుపు, ఆదాయపు దశ అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. పొదుపు దశ అంటే.. పాలసీ టర్మ్ ప్రథమార్థంలో వినియోగదారుడు క్రమవారీ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ దశ అంటే.. పాలసీ టర్మ్ ద్వితీయార్థంలో నెలవారీ ఆదాయం అందుకోవటం. ఈ పథకం మెచ్యూరిటీతో కూడిన ఆదాయం, కేవలం ఆదాయం అనే రెండు రకాలుగా అందుబాటులో ఉంది.
మెచ్యూరిటీతో కూడిన ఆదాయమైతే.. 24 ఏళ్ల పాలసీకి 13వ పాలసీ సంవత్సరం నుంచి పాలసీదారుడు ప్రతి నెలా హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 1 శాతాన్ని ఆదాయంగా పొందుతారు. అలాగే హామీ ఇవ్వబడిన మొత్తానికి 12 శాతాన్ని సంవత్సరంలో మొత్తం ఆదాయంగా అర్జిస్తారు కూడా. అదే కేవలం ఆదాయం మాత్రమే అయితే.. పాలసీదారుడు 13వ పాలసీ సంవత్సరం నుంచి ప్రతి నెలా హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 2 శాతాన్ని ఆదాయంగా పొందుతారు. అలాగే హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 24 శాతాన్ని సంవత్సరం ఆదాయంగా అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు టర్మ్ కాలంలో మరణించినట్లయితే కేసును బట్టి హామీ ఇవ్వబడిన మొత్తాన్ని లేదా ప్రీమియం 105 శాతం అందించబడుతుంది. అప్పటికే చెల్లించిన ఆదాయం ప్రయోజనాలతో సంబంధం లేకుండా నామినీ సంపూర్ణ ప్రయోజనాన్ని పొందుతారు.