
హోటళ్లూ ఆన్‌లైన్లో కొనేయొచ్చు!
ఇంట్లోకి అవసరమైన బియ్యం, పప్పు ఉప్పుల వంటి సరకులను కొనుగోలు చేయాలంటేనే ఒక్కోసారి చిరాకొస్తుంది.
♦ గంపగుత్త గ్రాసరీ ఆర్డర్ల కోసం జంబోగ్రాసరీ.కామ్
♦ హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లకు మాత్రమే సరఫరా
♦ ఢిల్లీ, గుర్గావ్‌లో సేవలు; నెల రోజుల్లో హైదరాబాద్‌లోనూ
♦ రూ.6 కోట్ల వార్షిక టర్నోవర్; రూ.25 కోట్ల నిధులకు కసరత్తు
♦ ‘స్టార్టప్ డైరీ’తో జంబోగ్రాసరీ కో–ఫౌండర్ సింబుల్ సిద్ధిఖీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లోకి అవసరమైన బియ్యం, పప్పు ఉప్పుల వంటి సరకులను కొనుగోలు చేయాలంటేనే ఒక్కోసారి చిరాకొస్తుంది. అలాంటిది పెద్ద మొత్తంలో సరకులు అవసరమైన హోటళ్లు, రెస్టారెంట్లకు ఇంకెంత ఇబ్బందుంటుందో ఆలోచించండి. ఆన్‌లైన్‌లో ఇంటికి అవసరమైన గ్రాసరీలను కొనుగోలు చేసినట్టుగా వాటిక్కూడా కొనుగోలు చేసే వీలుంటే బావుంటుంది కదూ! ఇదిగో ఇదే వ్యాపార వేదికగా ప్రారంభించింది జంబోగ్రాసరీ.కామ్.
దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లకు గ్రాసరీలను సరఫరా చేసే తొలి స్టార్టప్ ఇదే. నెల రోజుల్లో హైదరాబాద్‌లోనూ సేవలను ప్రారంభించనుంది. నగరంలోని పలు హోటళ్లతో చర్చలూ జరుపుతోంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ సింబుల్ సిద్ధిఖీ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘ఆతిథ్య రంగంలో వ్యాపార అవకాశాలను అందుకోవాలనే లక్ష్యంతో అభిషేక్ కుమార్‌తో కలిసి రూ.50 లక్షల పెట్టుబడులతో ఢిల్లీ కేంద్రంగా 2015 అక్టోబర్‌లో జంబోగ్రాసరీ.కామ్‌ను ప్రారంభించాం. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్స్, కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లకు నిత్యావసర సరుకుల్ని సరఫరా చేస్తుంటాం. బియ్యం, పప్పుధాన్యాలు, మసాలాలు, వంట నూనె, బేకరీ, డ్రై ఫూట్స్, పాల ఉత్పత్తుల వంటివన్నీ ఉంటాయి. సరకుల సేకరణకు నేరుగా తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
స్టార్ హోటల్స్ నుంచి కార్పొరేట్ ఆఫీసు వరకూ..
ప్రస్తుతం జేడబ్ల్యూ మారియట్, హిల్టన్, తాజ్ వివాంత, లెమన్ ట్రీ, కోర్ట్ యార్డ్, వెస్టిన్ వంటి ప్రముఖ హోటళ్లు... అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్నాప్‌డీల్, యాక్సెంచర్, ఎయిర్‌టెల్ వంటి కార్పొరేట్ క్యాంటీన్లు మా కస్టమర్లు. రోజు వారీ ఆర్డర్లుండవు. వారం, నెల వారీ ఆర్డర్లుంటాయి. కనిష్ట ఆర్డర్ విలువ రూ.50 వేలు. 75 రోజుల పాటు వడ్డీ లేకుండా గ్రాసరీలను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు అవసరమైన బిజినెస్ కార్డ్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నాం.
నెల రోజుల్లో హైదరాబాద్‌లో..
ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు విస్తరిస్తాం. హైదరాబాద్‌లో ప్యారడైజ్ వంటి రెస్టారెంట్‌లతో మాట్లాడుతున్నాం. పాత నగరాలతో పాటూ విస్తరణ నగరాల్లో గ్రాసరీలతో పాటూ మాంసాహార ఉత్పత్తులనూ సరఫరా చేయాలని నిర్ణయించాం. గ్రాసరీలతో పాటూ అతిథ్య సంస్థలకు అవసరమైన ఇతరత్రా ఉత్పత్తులను సరఫరా చేయాలని నిర్ణయించాం.
4 నెలల్లో రూ.25 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలకు రూ.50 లక్షల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ‘‘విస్తరణ ప్రణాళికల నిమిత్తం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.25 కోట్లు (4 మిలియన్ డాలర్ల) ఫండింగ్ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. మరో 4 నెలల్లో డీల్‌ను ముగిస్తాం’’ అని సిద్ధిఖీ వివరించారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...