కొత్త ఫామ్స్ వచ్చేశాయ్... | new tax forms... | Sakshi
Sakshi News home page

కొత్త ఫామ్స్ వచ్చేశాయ్...

Published Sun, Apr 10 2016 11:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కొత్త ఫామ్స్ వచ్చేశాయ్... - Sakshi

కొత్త ఫామ్స్ వచ్చేశాయ్...

దేశంలో ప్రతి పన్ను చెల్లింపుదారుడు, తాను ఆ ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం, చెల్లించిన పన్నును ప్రభుత్వం సూచించిన రూపంలో (ఫామ్స్‌లో) డిక్లేర్ చేయాలి. దీన్నే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌గా పిలుస్తున్నాం. ఇంకా సరళంగా చెప్పాలంటే.. మన స్కూల్లోని రిపోర్ట్ కార్డు లాంటిదే ఈ రిటర్న్. 2015-16 ఆర్థిక సంవత్సరానికి... అనగా 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరానికి మన ప్రభుత్వం 9 ఫామ్స్‌తోపాటు ఒక ‘ఎక్నాలెడ్జ్‌మెంట్ ఫామ్’ను కూడా నోటిఫై చేసింది. వీటిలో కొన్ని ఫామ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
 
ఐటీఆర్-1: ఈ ఫామ్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. వేతనం, ఇంటి అద్దె సహా ఇతర మూలాల నుంచి ఒక వ్యక్తి ఆదాయం గడిస్తుంటే అతను ఈ ఫామ్ ద్వారా రిటర్న్ వేయాలి. ఇది సాధారణమైన రిటర్న్.
 
ఐటీఆర్-2: ఈ ఫామ్ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. వ్యాపారం, వృత్తి మార్గాల్లో ఆదాయం లేనివారు, హిందూ ఉమ్మడి కుటుంబాలు ఈ ఫామ్‌ని వాడొచ్చు.
 
ఐటీఆర్-2ఏ: ఈ ఫామ్ కూడా వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. ఇది గత సంవత్సరమే వచ్చిన ఫామ్. విదేశీ ఆస్తులు, కాపిటల్ గెయిన్స్, వృత్తి వ్యాపార ఆదాయం లేని వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు ఈ ఫామ్‌ను వాడి రిటర్న్ వేయాలి.
 
ఐటీఆర్-3: వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు.. సంస్థల్లో భాగస్వాములైతే ఈ ఫామ్ వాడాలి. యజమానులు ఈ ఫామ్ వాడకూడదు. భాగస్వాములు మాత్రమే ఉపయోగించాలి.
 
ఐటీఆర్-4: వృత్తి వ్యాపారాల నుంచి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు వాడాల్సిన ఫామ్. ఇన్సూరెన్స్ ఏజెంట్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు తదితరులు వేయాల్సిన రిటర్ను.
 
ఐటీఆర్-4ఎస్: చిన్న వ్యాపారులు అనగా రూ.కోటి కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు వేయాల్సిన రిటర్ను. చిన్న వ్యాపారులకు వారి ఖాతా పుస్తకాలు, లాభనష్టాలను లెక్కించే వనరులు ఉండకపోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొని మన ఆదాయ పన్ను శాఖ చిన్న వ్యాపారులకు స్థూల ఆదాయం ప్రకారం పన్ను లెక్కించి చెల్లించే పద్ధతిని తీసుకువచ్చింది. నికర ఆదాయాన్ని స్థూల ఆదాయంలో 8 శాతంగా లెక్కిస్తారు. ఇటువంటి వ్యాపారులు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయనక్కర్లేదు. అడ్వాన్స్ టాక్స్ కట్టనవసరం లేదు. ఇది వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థలకు కాదు. ఉదాహరణకు కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు వారు ఈ రిటర్న్ వేయాలి.
 
ఐటీఆర్4-4ఎస్‌కు తేడా ఏంటి?
వృత్తి వ్యాపార ఆదాయాన్ని ఐటీఆర్-4 ఫామ్ వాడి రిటర్న్ వేయాలి. చిన్న వ్యాపారులు కాని, పెద్ద వ్యాపారులు కాని ఎవరైనా ఈ ఫామ్‌ను వాడొచ్చు. ఐటీఆర్-4 చిన్న వెర్షన్ ఐటీఆర్-4ఎస్. ఊహించే పద్ధతిని ఎంపిక చేసుకున్న వ్యాపారులు మాత్రమే 4ఎస్ ఫామ్‌ను వాడాలి. మన ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం కొందరు వ్యాపారులే 4ఎస్‌ను వాడాలి. మిగతా ఫామ్స్ గురించి వచ్చే వారం చూద్దాం.
- కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement