
సాగు ఆదాయంపై పన్ను లేదు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: వ్యవసాయానికి సంబంధించిన ఆదాయంపై పన్ను విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. సాగుఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రొయ్ ప్రతిపాదనపై జైట్లీ ట్వీటర్‌లో స్పందించారు. రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాల ప్రకారం సాగు ఆదాయంపై పన్ను వేసే అధికారం కేంద్రం పరిధిలో లేద న్నారు. గ్రామీణ వ్యవసాయ ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తేవాలని డెబ్రొయ్ చెప్పిన సంగతి తెలిసిందే.
వ్యక్తిగత ఆదాయ పన్ను విభాగంలో ఇస్తున్న మినహాయింపులు రద్దు చేయాలని సూచించారు. ఇదే విషయమై మార్చి 22న పార్లమెంట్‌లో మాట్లాడిన జైట్లీ.. వ్యవసాయ ఆదాయంపై పన్ను వేయబోమని చెప్పారు. తాజాగా డెబ్రొయ్ సూచనల నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. కాగా, డెబ్రొయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో తమకు సంబంధం లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
ఉగ్రవాదంపై ఉమ్మడి కార్యాచరణ
మాస్కో: ఉగ్రవాద గ్రూపులకు నిధులతో పాటు శిక్షణ అందించి, సహకరించే దేశాలకు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. ఇక్కడ జరిగిన ఆరో అంతర్జాతీయ భద్రతా సదస్సునుద్దేశించి భారత రక్షణ, ఆర్థిక శాఖల మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం సరికొత్త రూపు సంతరించుకుని ప్రమాదకర పద్ధతుల్లో దాడి చేస్తోందన్నారు. దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని అభిప్రాయ పడ్డారు. ఐసిస్ పలు దేశాలకు గట్టిగా సవాలు విసురుతోందన్నారు.
‘ప్రధాన దేశాలు ఉగ్ర పోరులో పరస్పరం సహకరిం చుకోవాలి. ఈ ప్రయత్నంలో అన్ని దేశాలు మూకుమ్మడిగా చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలి. అదేసమయంలో మధ్యతూర్పు ప్రాంతంలో పుట్టుకొస్తున్న ఉగ్రవాద మొలకలను ఏరిపారేయడానికి యత్నించాలి. ప్రస్తుతం అన్ని శాంతియుత దేశాలకు భద్రత ప్రధాన సవాలుగా నిలుస్తోంది’ అని జైట్లీ అన్నారు.