
అంచనాలకు అనుగుణంగానే డాలర్ ఇండెక్స్ మళ్లీ కింద చూపు చూడ్డం ప్రారంభించింది. ఇదే అదనుగా మళ్లీ పసిడి వారంలో ముందుకు దూసుకుపోయింది. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 16వ తేదీతో ముగిసిన వారంలో పసిడి 32 డాలర్లు లాభపడి 1,350 డాలర్లకు ఎగిసింది. ఈ వారం ఒక దశలో పసిడి ఏకంగా ఐదు నెలల గరిష్టస్థాయి 1,363 డాలర్లను కూడా తాకింది. వారాల వారీగా చూస్తే, రెండు వారాలు వెనక్కు తగ్గిన పసిడి, మళ్లీ ఒకేవారంలో అంతే పైకి లేవడం గమనార్హం.
నెలలవారీగా చూస్తే, నాలుగు నెలలుగా దూకుడును ప్రదర్శిస్తోంది. ఇక డాలర్ ఇండెక్స్ నేపథ్యం చూస్తే, దిగువ ముఖ పయన ధోరణి 16వ తేదీతో ముగిసిన వారంలో మరింత స్పష్టమైంది. మూడు వారాల క్రితం మూడేళ్ల కనిష్ట స్థాయి (88.30)కి పడి, అటుపై కొంత తేరుకుని 90 పైకి లేచిన డాలర్ ఇండెక్స్, గడచిన వారంలో ఒక దశలో మళ్లీ ఏకంగా 88.18 స్థాయికి పతనమైంది. తిరిగి కొంత కోలుకుని వారం వారీగా 1.18 నష్టంతో 89.03 స్థాయిలో ముగిసింది.
ఈ డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకుల ధోరణి అమెరికా ఆర్థిక ఆనిశ్చితికి అద్దం పడుతోందని, ఇదే ధోరణి కొనసాగితే, వచ్చే రెండు వారాల్లో పసిడి 1,400 డాలర్లవైపు పరుగు ఖాయమని నిపుణుల వాదన. దేశీయంగానూ దూకుడు ఇక దేశీయంగా చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా 18పైసలు బలహీనపడ్డం (10వ తేదీతో ముగిసిన వారంలో 64.40), అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి దూకుడు వంటి అంశాలు దేశంలోనూ బంగారం మెరుపునకు కారణమయ్యాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజి (ఎంసీఎక్స్)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 791 పెరిగి, రూ.30,801కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్ లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ. 785 లాభంతో రూ.30,915కు ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో పెరిగి రూ. 30,765కు చేరింది. వెండి కేజీ ధర భారీగా 790 లాభపడి, రూ. 38,710కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment