తర్వాత ఐఎంఎఫ్ చీఫ్ మనోడేనా...?
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టీన్ లగార్డే పదవీ కాలం ముగుస్తోంది. దీంతో ఆయన వారసుడిగా.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచే ఒకరిని ఎన్నుకోవాలని భారత్ ప్రతిపాదించింది. ఇన్నాళ్లూ యూరోపియన్లు మాత్రమే దీనికి చీఫ్ అయ్యేవాళ్లు. ఈ పద్ధతిని మార్చి, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలకు అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈసారి ఐఎంఎఫ్ అభ్యర్థి రేసులో వేరే ఏ దేశం వాళ్లు లేకపోవడంతో, రెండోసారి కూడా క్రిస్టీన్ లగార్డేకే భారత్ మద్దతిచ్చిందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు.
కానీ తర్వాతి ఎన్నికల్లో కచ్చితంగా ఐఎమ్ఎఫ్ ఎండీ స్థానం అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలకే కల్పించాలని దాస్ అభిప్రాయం వ్యక్తంచేశారు. భారత మీడియాప్రతినిధులు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ ఎన్నికపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, దాస్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఐఎమ్ఎఫ్ చీఫ్ గా క్రిస్టీన్ లగార్డేను ఎన్నుకునేటప్పుడు, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల మధ్య ఏకగ్రీవ అభిప్రాయం లేకపోవడాన్ని ఆయన ఈ సమావేశంలో ఎత్తిచూపారు. దాస్ వ్యక్తంచేసిన ఈ అభిప్రాయంతో తర్వాతి ఐఎమ్ఎఫ్ ఎన్నికల్లో భారత్ పోటీకి నిలబడుతుందని తెలుస్తోంది.