నిర్మా చేతికి లఫార్జ్ ఇండియా.. | Nirma to buy Lafarge India assets from LafargeHolcim for $1.4 billion | Sakshi
Sakshi News home page

నిర్మా చేతికి లఫార్జ్ ఇండియా..

Published Tue, Jul 12 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

నిర్మా చేతికి లఫార్జ్ ఇండియా..

నిర్మా చేతికి లఫార్జ్ ఇండియా..

డీల్ విలువ రూ.9,400 కోట్లు...
సిమెంట్ ప్లాంట్ల విక్రయ ఒప్పందాన్ని
ప్రకటించిన లఫార్జ్‌హోల్సిమ్

న్యూఢిల్లీ : సిమెంట్ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్... భారత్‌లోని తన లఫార్జ్ ఇండియా ఆస్తులను నిర్మా గ్రూప్‌నకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.9,400 కోట్లు) పేర్కొంది. అయితే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదానికి లోబడి ఈ ఒప్పందం పూర్తవుతుందని లఫార్జ్ హోల్సిమ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గుజరాత్‌కు చెందిన నిర్మా గ్రూప్.. సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ ఇతరత్రా కెమికల్స్ తయారీ రంగంలో దేశవ్యాప్తంగా పేరొందింది. ఇప్పుడు సిమెంట్, ప్యాకేజింగ్, సాఫ్ట్‌వేర్ ఇతరత్రా రంగాల్లోనూ దూసుకెళుతోంది. భారత్, అమెరికాల్లో నిర్మాకు 12 సిమెంట్ తయారీ ప్లాంట్‌లున్నాయి. ఈ విభాగం టర్నోవర్ రూ.7,300 కోట్లకు పైగానే ఉంటుంది.

 సీసీఐ ఆమోదం కోసమే...
ఫ్రాన్స్‌కు చెందిన లఫార్జ్ గ్రూప్, స్విస్ దిగ్గజం హోల్సిమ్‌లు విలీనం అవుతున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఈ విలీన కంపెనీ ఆవిర్భవించింది. అయితే, సిమెంట్ రంగంలో గుత్తాధిపత్య దోరణులకు అడ్డుకట్టవేయడం కోసం ఈ విలీనానికి వివిధ దేశాల్లో నియంత్రణ సంస్థల అనుమతులు తప్పనిసరి అయ్యాయి. దీంతో భారత్‌లోని సీసీఐ ఆదేశాల మేరకు తమకు ఇక్కడున్న ఆస్తుల్లో దాదాపు 3.6 బిలియన్ డాలర్లమేర ఆస్తుల్ని విక్రయించనున్నట్లు లఫార్జ్ హోల్సిమ్ వెల్లడించింది. అందులోభాగంగానే ఇప్పుడు లఫార్జ్ ఇండియా ఆస్తులను విక్రయించడానికి నిర్మాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ఈ డీల్ ద్వారా లభించే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లఫార్జ్ ఇండియాకు మూడు సిమెంట్ తయారీ, రెండు గ్రైండింగ్ ప్లాంట్‌లున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 11 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ). అదేవిధంగా రెడీ-మిక్స్ కాంక్రీట్ ఇతరత్రా సిమెంట్ ఉత్పత్తులను కూడా భారత్‌లో విక్రయిస్తోంది. ఈ ఆస్తుల విక్రయం మొత్తం పూర్తయ్యాక కూడా భారత్‌లో తమ అనుబంధ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా లఫార్జ్ హోల్సిమ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. వీటి సామర్థ్యం 60 ఎంటీపీఏ. లఫార్జ్ హోల్సిమ్‌కు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో కార్యకలాపాలున్నాయి. వార్షిక టర్నోవర్ 30 బిలియన్ డాలర్లు.

నిర్మా రూ. 4 వేల కోట్ల సమీకరణ...!
లఫార్జ్ ఇండియా సిమెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం కోసం నిర్మా భారీగా నిధుల సమీకరణ చేపట్టనుంది. బాండ్స్ జారీ ద్వారా త్వరలోనే రూ.4,000 కోట్లను సమీకరించనున్నట్లు సమాచారం. ఈ ఇష్యూ పూర్తయితే దేశంలో ఒక కంపెనీ కొనుగోలు కోసం చేపట్టిన అతిపెద్ద రూపీ బాండ్ ఇష్యూగా నిలుస్తుందని మర్చెంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ బాండ్ల జారీ కోసం బార్‌క్లేస్, క్రెడిట్ సూసీ, ఐడీఎఫ్‌సీలను మర్చెంట్ బ్యాంకర్లుగా నిర్మా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement