Nirma Group
-
ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?
Surf Excel Success Story : ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్, దాగ్ అచ్చీ హై’ వంటి టీవీ ప్రకటనలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సర్ఫ్ ఎక్సెల్. చిన్న ప్యాకెట్‌తో మొదలైన సర్ఫ్ ఎక్సెల్ ప్రస్థానం నేడు అమ్మకాల్లో మాతృసంస్థ హెచ్‌యూఎల్‌కు చెందిన 50 రకాల ఉత్పత్తులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అందుకు కారణాలేంటి? మనందరి ఇళ్లలో విస్తృతంగా వినియోగించే సర్ఫ్ ఎక్సెల్ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) 1957లో పెట్రోకెమికల్స్‌తో తయారు చేసిన ఎన్ఎస్డీ (నాన్-సోప్ డిటర్జెంట్) పౌడర్‌గా సర్ఫ్‌ను ప్రారంభించింది. గృహిణులు సౌకర్యంగా వినియోగించుకునేలా 1959లో హెచ్‌యూఎల్ సర్ఫ్ ఎక్సెల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫ్ అని పిలిచే ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ‘డిటర్జెంట్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. అందుకు అనేక కారణాలున్నాయి. నురగ రావడం లేదని వాషింగ్ మెషీన్లు రాకముందు భారతీయులు బట్టల్ని ఉతకేందుకు సర్ఫ్ వినియోగం వల్ల పొందే ప్రయోజనాలు తెలిసినప్పటికీ సబ్బుల్ని మాత్రమే వాడే వారు. ఎందుకంటే అప్పట్లో సర్ఫ్ ఉపయోగిస్తే ట్యాప్ వాటర్‌తో బట్టల్ని ఉతికితే నురగ వచ్చేది కాదు. నురగవస్తే బట్టలకున్న మురికి పోతుందని నమ్మేవారు. ఆ నమ్మకమే సర్ఫ్ ఎక్సెల్ వినియోగంలో గృహిణులు విముఖత వ్యక్తం చేసేవారు. ప్రజల్ని నమ్మించి.. ఈ సమస్యనే ఛాలెంజింగ్ తీసుకున్న హెచ్‌యూఎల్ తమ ఉత్పత్తి సర్ఫ్ ఎక్సెల్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. బట్టల సోప్‌తో బట్టలు ఎలా శుభ్రం అవుతాయో.. ట్యాప్ వాటర్‌లో సర్ఫ్ ఎక్సెల్‌ను వినియోగిస్తే నురగ రావడమే కాదు, బట్టలు శుభ్రమవుతాయని ప్రజల్ని నమ్మించింది. బహిరంగంగా చేసి చూపించింది. ఫలితాలు రావడంతో ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం, వ్యాపార ప్రకటనలతో సర్ఫ్ ఎక్సెల్ సేల్స్ అమాంతం పెరిగాయి. సర్ఫ్ ఎక్సెల్‌కు పోటీగా నిర్మా అయితే డిటర్జెంట్ ప్రొడక్ట్‌లలో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు, దాని మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోవడంతో.. పోటీగా 1969లలో ‘నిర్మా’ వంటి ఇతర సంస్థలు సైతం డిటర్జెంట్ ఉత్పత్తుల్ని పోటా పోటీగా మార్కెట్లో విడుదల చేశాయి. అలా పోటీకి దిగిన నిర్మా..సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలకు చెక్ పెట్టింది. చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చిన నిర్మా తక్కువ ధరలోనే ఆ కంపెనీకి చెందిన నిర్మా వాషింగ్ ఫౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.3.50లకు అమ్మగా.. అదే సమయంలో హెచ్ యూఎల్ కంపెనీకి చెందిన సర్ఫ్ ఎక్సెల్ కేజీ సర్ఫ్ ఫౌడర్ ప్యాకెట్ ధర రూ.15కి అమ్మింది. అంతలోనే నష్టాలు దీంతో అప్పటి వరకు డిటర్జెంట్ విభాగంలో రారాజుగా వెలుగొందిన సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. ధర ఎక్కువ కావడంతో సేల్స్ తగ్గాయి. హెచ్‌యూఎల్‌కు ఊహించని నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నిర్మాను ఢీ కొట్టి, నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కోసం కవిత చౌదరీ (లలితాజీ) ని రంగంలోకి దించింది హెచ్ యూఎల్ బ్రాండ్. ట్రెండ్ సెట్టర్‌గా లలితాజీ కవితా చౌదరితో వినియోగదారులకు సర్ఫ్ ఎక్సెల్ ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్’ (చౌక - మంచిది) యాడ్ క్యాంపెయిన్‌ను తయారు చేయించింది. నిర్మా సర్ఫ్ తక్కువ ధరలకు ప్రతి స్పందనగా ఇంటి పేరుగా మారితే.. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ యాడ్ డబ్బు విలువను వివరించేలా తీయడం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ దశ తిరిగింది. డబ్బు విలువ చెబుతూ తీసిన యాడ్‌కు కొనుగోలు దారులు ఫిదా అయ్యారు. మళ్లీ సర్ఫ్ ఎక్సెల్స్ను వాడటం మొదలు పెట్టారు. ఇలా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ విభాగంలో దేశంలోనే తొలి బ్రాండ్ గా చరిత్ర సుష్టించడమే కాదు.. టీవీ చానల్స్‌లో యాడ్స్‌ను ప్రసారం చేయించిన బ్రాండ్లలలో సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది. 30ఏళ్ల పాటు చక్రం తిప్పి 30 ఏళ్ల పాటు డిటర్జెంట్ విభాగంలో చక్రం తిప్పిన సర్ఫ్ ఎక్సెల్‌కు నిర్మా తర్వాత 1991లో భారతీయ స్త్రీల అవసరాల్ని, ఆర్ధిక స్థాయిల్ని అర్ధం చేసుకున్న పీ అండ్ జీ సంస్థ ఎరియల్ను పరిచయం చేసింది. ఎయిరియల్ సైతం ధర తక్కువ కావడం, బకెట్ నీరు, వాషింగ్ మెషీన్లో వినియోగించుకొని బట్టల్ని శుభ్రం చేస్తుంది. మొండి మరకల్ని తరిమికొడుతుందంటూ చేసిన ఏరియల్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు సర్ఫ్ ఎక్సెల్, నిర్మాను వాడిని సామాన్యులు ఏరియల్‌ను వినియోగించుందుకు మొగ్గు చూపారు. ఈ సారి చిన్నపిల్లలతో దీంతో మళ్లీ పునారలోచనలో పడ్డ సర్ఫ్ ఎక్సెల్ ‘దాగ్ అచ్చే హై’ అంటూ మరో యాడ్‌ను రూపొందించింది. మరక మంచిదే నంటూ చిన్నపిల్లల తీసిన యాడ్‌లో..మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం’ అని చెప్పడంలో మరో మారు తన మార్క్ సేల్ స్ట్రాటజీని అప్లయి చేయడం అది కాస్తా వర్కౌట్ అయ్యింది. ఇలా పదికి పైగా అడ్వటైజ్మెంట్స్తో పాటు ప్రజాదరణతో ఇండస్ట్రీలో సర్ఫ్ బ్రాండ్లలో సర్ఫ్ ఎక్సెల్ ప్రముఖ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తుంది. రూ.70,000 కోట్ల అమ్మకాల దిశగా ఇటీవల,హెచ్‌యుఎల్ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్‌గా ఎదిగింది. సబ్బులు, వాషింగ్ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్లో హెచ్‌యూఎల్ ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్ ఎక్సెల్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బ్రాండే హెచ్‌యూఎల్ సైతం ప్రీమియం ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు ఊతం ఇచ్చింది. వెరసీ బ్రాండ్ దేశం మొత్తం డిటర్జెంట్ల మార్కెట్లో అధిక షేర్ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్ఫ్ ఎక్స్‌ల్ డిమాండ్‌ను బట్టి 2027 నాటికి రూ.70,000 కోట్ల అమ్మకాలను అధిగమిస్తుందని అంచనా. చదవండి👉 వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్ -
ఈ వారం 4 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఇటీవల కొనసాగుతున్న ప్రైమరీ మార్కెట్ల హవా నేపథ్యంలో ఈ వారం మరో 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. జాబితాలో నిర్మా గ్రూప్ కంపెనీ నువోకో విస్టాస్ కార్పొరేషన్, ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్‌ట్రేడ్ టెక్, గృహ రుణాల సంస్థ ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఉన్నాయి. నువోకో విస్టాస్, కార్‌ట్రేడ్ టెక్ నేడు(9న) ప్రారంభంకానుండగా.. ఆప్టస్ వేల్యూ, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ మంగళవారం(10న) ఇష్యూకి రానున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 14,628 కోట్లు సమీకరించనున్నాయి. నువోకో, కార్‌ట్రేడ్ ఇష్యూలు 11న, ఆప్టస్, కెమ్‌ప్లాస్ట్ 12న ముగియనున్నాయి. గత వారం సైతం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టిన సంగతి తెలిసిందే. దేవయాని ఇంటర్నేషనల్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, విండ్లాస్ బయోటెక్, ఎగ్జారో టైల్స్ సంయుక్తంగా రూ. 3,614 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. రూ. 30,666 కోట్లు గత ఆర్థిక సంవత్సరం(2020–21) 30 కంపెనీలు ఐపీవోలకు రావడం ద్వారా రూ. 31,277 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాది(2021–22)లో ఇప్పటివరకూ 16 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 30,666 కోట్లు అందుకున్నాయి. వెరసి తొలి ఐదు నెలల్లోనే గతేడాదిని మించి నిధులను సమకూర్చుకోగలిగాయి. ఈ ఏడాది ఇకపై మరో రూ. 70,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను తాకనున్నట్లు శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈక్విటీస్ హెడ్ హేమంగ్ కాపసీ పేర్కొన్నారు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. ఇతర వివరాలు నువోకో విస్టాస్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 560–570కాగా.. రూ. 5,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక కార్‌ట్రేడ్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1,585–1,618గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,999 కోట్లవరకూ అందుకోవాలని చూస్తోంది. ఆప్టస్ వేల్యూ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 346–353కాగా.. రూ. 2,780 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక రూ. 3,850 కోట్ల ఐపీవోకు కెమ్‌ప్లాస్ట్ సన్మార్ రూ. 530–541 ధరల శ్రేణిని ప్రకటించింది. -
నిర్మా గ్రూప్ నువోకో ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్ రంగ కంపెనీ నువోకో విస్టాస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 560–570గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ నియోగీ ఎంటర్ప్రైజెస్ రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. నువోకో విస్టాస్ ఐదు సమీకృత, ఐదు గ్రైండింగ్, ఒక బ్లెండింగ్ యూనిట్‌తోపాటు 11 సిమెంట్ ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం వార్షికంగా 22.32 ఎంఎంటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, హర్యానాలలో సిమెంట్ తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. గతంలో లఫార్జ్ ఇండియాగా కార్యకలాపాలు సాగించిన కంపెనీ 2020 ఫిబ్రవరిలో ఇమామీ గ్రూప్ సిమెంట్ బిజినెస్‌ను కొనుగోలు చేసింది. -
వాషింగ్‌పౌడర్ నిర్మా.. వెనుక పెను విషాదం
చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్భాయ్ పటేల్. సాక్షి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటి వెనుక షెడ్డులో రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా కర్సన్భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం. ఊహించని విషాదం ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిర్మాకు శ్రీకారం ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్‌గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్‌పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. జింగిల్ మ్యాజిక్ ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్టైజ్మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్‌గా మారింది. కూతురిపై ప్రేమ నిర్మా అడ్వెర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది. నంబర్‌వన్ 2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది. విద్యారంగంలో నిర్మా నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. 40 వేల కోట్లకు పైమాటే ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు. -
నిర్మా చేతికి లఫార్జ్ ఇండియా..
♦ డీల్ విలువ రూ.9,400 కోట్లు... ♦ సిమెంట్ ప్లాంట్ల విక్రయ ఒప్పందాన్ని ♦ ప్రకటించిన లఫార్జ్‌హోల్సిమ్ న్యూఢిల్లీ : సిమెంట్ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్... భారత్‌లోని తన లఫార్జ్ ఇండియా ఆస్తులను నిర్మా గ్రూప్‌నకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.9,400 కోట్లు) పేర్కొంది. అయితే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదానికి లోబడి ఈ ఒప్పందం పూర్తవుతుందని లఫార్జ్ హోల్సిమ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గుజరాత్‌కు చెందిన నిర్మా గ్రూప్.. సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ ఇతరత్రా కెమికల్స్ తయారీ రంగంలో దేశవ్యాప్తంగా పేరొందింది. ఇప్పుడు సిమెంట్, ప్యాకేజింగ్, సాఫ్ట్వేర్ ఇతరత్రా రంగాల్లోనూ దూసుకెళుతోంది. భారత్, అమెరికాల్లో నిర్మాకు 12 సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. ఈ విభాగం టర్నోవర్ రూ.7,300 కోట్లకు పైగానే ఉంటుంది. సీసీఐ ఆమోదం కోసమే... ఫ్రాన్స్‌కు చెందిన లఫార్జ్ గ్రూప్, స్విస్ దిగ్గజం హోల్సిమ్‌లు విలీనం అవుతున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఈ విలీన కంపెనీ ఆవిర్భవించింది. అయితే, సిమెంట్ రంగంలో గుత్తాధిపత్య దోరణులకు అడ్డుకట్టవేయడం కోసం ఈ విలీనానికి వివిధ దేశాల్లో నియంత్రణ సంస్థల అనుమతులు తప్పనిసరి అయ్యాయి. దీంతో భారత్‌లోని సీసీఐ ఆదేశాల మేరకు తమకు ఇక్కడున్న ఆస్తుల్లో దాదాపు 3.6 బిలియన్ డాలర్లమేర ఆస్తుల్ని విక్రయించనున్నట్లు లఫార్జ్ హోల్సిమ్ వెల్లడించింది. అందులోభాగంగానే ఇప్పుడు లఫార్జ్ ఇండియా ఆస్తులను విక్రయించడానికి నిర్మాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ డీల్ ద్వారా లభించే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లఫార్జ్ ఇండియాకు మూడు సిమెంట్ తయారీ, రెండు గ్రైండింగ్ ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 11 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ). అదేవిధంగా రెడీ-మిక్స్ కాంక్రీట్ ఇతరత్రా సిమెంట్ ఉత్పత్తులను కూడా భారత్‌లో విక్రయిస్తోంది. ఈ ఆస్తుల విక్రయం మొత్తం పూర్తయ్యాక కూడా భారత్‌లో తమ అనుబంధ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా లఫార్జ్ హోల్సిమ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. వీటి సామర్థ్యం 60 ఎంటీపీఏ. లఫార్జ్ హోల్సిమ్కు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో కార్యకలాపాలున్నాయి. వార్షిక టర్నోవర్ 30 బిలియన్ డాలర్లు. నిర్మా రూ. 4 వేల కోట్ల సమీకరణ...! లఫార్జ్ ఇండియా సిమెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం కోసం నిర్మా భారీగా నిధుల సమీకరణ చేపట్టనుంది. బాండ్స్ జారీ ద్వారా త్వరలోనే రూ.4,000 కోట్లను సమీకరించనున్నట్లు సమాచారం. ఈ ఇష్యూ పూర్తయితే దేశంలో ఒక కంపెనీ కొనుగోలు కోసం చేపట్టిన అతిపెద్ద రూపీ బాండ్ ఇష్యూగా నిలుస్తుందని మర్చెంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ బాండ్ల జారీ కోసం బార్క్లేస్, క్రెడిట్ సూసీ, ఐడీఎఫ్సీలను మర్చెంట్ బ్యాంకర్లుగా నిర్మా నియమించుకున్నట్లు తెలుస్తోంది.