చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్‌భాయ్ పటేల్.
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది.
ఇంటి వెనుక షెడ్డులో
రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా కర్సన్‌భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్‌కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్‌భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం.
ఊహించని విషాదం
ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్‌భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది.
నిర్మాకు శ్రీకారం
ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్‌గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు.
ఉద్యోగానికి రాజీనామా
నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్‌పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్‌లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది.
జింగిల్ మ్యాజిక్
ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్‌భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్‌టైజ్‌మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్‌గా మారింది.
కూతురిపై ప్రేమ
నిర్మా అడ్వెర్‌టైజ్‌మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్‌అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది.
నంబర్‌వన్
2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది.
విద్యారంగంలో నిర్మా
నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్‌భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు.
40 వేల కోట్లకు పైమాటే
ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్‌భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment