Detergent powder
-
ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్ తినడంతో..
తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?
Surf Excel Success Story : ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్, దాగ్ అచ్చీ హై’ వంటి టీవీ ప్రకటనలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సర్ఫ్ ఎక్సెల్. చిన్న ప్యాకెట్‌తో మొదలైన సర్ఫ్ ఎక్సెల్ ప్రస్థానం నేడు అమ్మకాల్లో మాతృసంస్థ హెచ్‌యూఎల్‌కు చెందిన 50 రకాల ఉత్పత్తులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అందుకు కారణాలేంటి? మనందరి ఇళ్లలో విస్తృతంగా వినియోగించే సర్ఫ్ ఎక్సెల్ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) 1957లో పెట్రోకెమికల్స్‌తో తయారు చేసిన ఎన్ఎస్డీ (నాన్-సోప్ డిటర్జెంట్) పౌడర్‌గా సర్ఫ్‌ను ప్రారంభించింది. గృహిణులు సౌకర్యంగా వినియోగించుకునేలా 1959లో హెచ్‌యూఎల్ సర్ఫ్ ఎక్సెల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫ్ అని పిలిచే ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ‘డిటర్జెంట్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. అందుకు అనేక కారణాలున్నాయి. నురగ రావడం లేదని వాషింగ్ మెషీన్లు రాకముందు భారతీయులు బట్టల్ని ఉతకేందుకు సర్ఫ్ వినియోగం వల్ల పొందే ప్రయోజనాలు తెలిసినప్పటికీ సబ్బుల్ని మాత్రమే వాడే వారు. ఎందుకంటే అప్పట్లో సర్ఫ్ ఉపయోగిస్తే ట్యాప్ వాటర్‌తో బట్టల్ని ఉతికితే నురగ వచ్చేది కాదు. నురగవస్తే బట్టలకున్న మురికి పోతుందని నమ్మేవారు. ఆ నమ్మకమే సర్ఫ్ ఎక్సెల్ వినియోగంలో గృహిణులు విముఖత వ్యక్తం చేసేవారు. ప్రజల్ని నమ్మించి.. ఈ సమస్యనే ఛాలెంజింగ్ తీసుకున్న హెచ్‌యూఎల్ తమ ఉత్పత్తి సర్ఫ్ ఎక్సెల్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. బట్టల సోప్‌తో బట్టలు ఎలా శుభ్రం అవుతాయో.. ట్యాప్ వాటర్‌లో సర్ఫ్ ఎక్సెల్‌ను వినియోగిస్తే నురగ రావడమే కాదు, బట్టలు శుభ్రమవుతాయని ప్రజల్ని నమ్మించింది. బహిరంగంగా చేసి చూపించింది. ఫలితాలు రావడంతో ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం, వ్యాపార ప్రకటనలతో సర్ఫ్ ఎక్సెల్ సేల్స్ అమాంతం పెరిగాయి. సర్ఫ్ ఎక్సెల్‌కు పోటీగా నిర్మా అయితే డిటర్జెంట్ ప్రొడక్ట్‌లలో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు, దాని మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోవడంతో.. పోటీగా 1969లలో ‘నిర్మా’ వంటి ఇతర సంస్థలు సైతం డిటర్జెంట్ ఉత్పత్తుల్ని పోటా పోటీగా మార్కెట్లో విడుదల చేశాయి. అలా పోటీకి దిగిన నిర్మా..సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలకు చెక్ పెట్టింది. చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చిన నిర్మా తక్కువ ధరలోనే ఆ కంపెనీకి చెందిన నిర్మా వాషింగ్ ఫౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.3.50లకు అమ్మగా.. అదే సమయంలో హెచ్ యూఎల్ కంపెనీకి చెందిన సర్ఫ్ ఎక్సెల్ కేజీ సర్ఫ్ ఫౌడర్ ప్యాకెట్ ధర రూ.15కి అమ్మింది. అంతలోనే నష్టాలు దీంతో అప్పటి వరకు డిటర్జెంట్ విభాగంలో రారాజుగా వెలుగొందిన సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. ధర ఎక్కువ కావడంతో సేల్స్ తగ్గాయి. హెచ్‌యూఎల్‌కు ఊహించని నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నిర్మాను ఢీ కొట్టి, నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కోసం కవిత చౌదరీ (లలితాజీ) ని రంగంలోకి దించింది హెచ్ యూఎల్ బ్రాండ్. ట్రెండ్ సెట్టర్‌గా లలితాజీ కవితా చౌదరితో వినియోగదారులకు సర్ఫ్ ఎక్సెల్ ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్’ (చౌక - మంచిది) యాడ్ క్యాంపెయిన్‌ను తయారు చేయించింది. నిర్మా సర్ఫ్ తక్కువ ధరలకు ప్రతి స్పందనగా ఇంటి పేరుగా మారితే.. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ యాడ్ డబ్బు విలువను వివరించేలా తీయడం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ దశ తిరిగింది. డబ్బు విలువ చెబుతూ తీసిన యాడ్‌కు కొనుగోలు దారులు ఫిదా అయ్యారు. మళ్లీ సర్ఫ్ ఎక్సెల్స్ను వాడటం మొదలు పెట్టారు. ఇలా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ విభాగంలో దేశంలోనే తొలి బ్రాండ్ గా చరిత్ర సుష్టించడమే కాదు.. టీవీ చానల్స్‌లో యాడ్స్‌ను ప్రసారం చేయించిన బ్రాండ్లలలో సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది. 30ఏళ్ల పాటు చక్రం తిప్పి 30 ఏళ్ల పాటు డిటర్జెంట్ విభాగంలో చక్రం తిప్పిన సర్ఫ్ ఎక్సెల్‌కు నిర్మా తర్వాత 1991లో భారతీయ స్త్రీల అవసరాల్ని, ఆర్ధిక స్థాయిల్ని అర్ధం చేసుకున్న పీ అండ్ జీ సంస్థ ఎరియల్ను పరిచయం చేసింది. ఎయిరియల్ సైతం ధర తక్కువ కావడం, బకెట్ నీరు, వాషింగ్ మెషీన్లో వినియోగించుకొని బట్టల్ని శుభ్రం చేస్తుంది. మొండి మరకల్ని తరిమికొడుతుందంటూ చేసిన ఏరియల్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు సర్ఫ్ ఎక్సెల్, నిర్మాను వాడిని సామాన్యులు ఏరియల్‌ను వినియోగించుందుకు మొగ్గు చూపారు. ఈ సారి చిన్నపిల్లలతో దీంతో మళ్లీ పునారలోచనలో పడ్డ సర్ఫ్ ఎక్సెల్ ‘దాగ్ అచ్చే హై’ అంటూ మరో యాడ్‌ను రూపొందించింది. మరక మంచిదే నంటూ చిన్నపిల్లల తీసిన యాడ్‌లో..మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం’ అని చెప్పడంలో మరో మారు తన మార్క్ సేల్ స్ట్రాటజీని అప్లయి చేయడం అది కాస్తా వర్కౌట్ అయ్యింది. ఇలా పదికి పైగా అడ్వటైజ్మెంట్స్తో పాటు ప్రజాదరణతో ఇండస్ట్రీలో సర్ఫ్ బ్రాండ్లలో సర్ఫ్ ఎక్సెల్ ప్రముఖ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తుంది. రూ.70,000 కోట్ల అమ్మకాల దిశగా ఇటీవల,హెచ్‌యుఎల్ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్‌గా ఎదిగింది. సబ్బులు, వాషింగ్ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్లో హెచ్‌యూఎల్ ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్ ఎక్సెల్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బ్రాండే హెచ్‌యూఎల్ సైతం ప్రీమియం ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు ఊతం ఇచ్చింది. వెరసీ బ్రాండ్ దేశం మొత్తం డిటర్జెంట్ల మార్కెట్లో అధిక షేర్ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్ఫ్ ఎక్స్‌ల్ డిమాండ్‌ను బట్టి 2027 నాటికి రూ.70,000 కోట్ల అమ్మకాలను అధిగమిస్తుందని అంచనా. చదవండి👉 వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్ -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
దేశంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద కూడా కనిపిస్తుంది. సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఐటీసీ లిమిటెడ్ పేర్కొన్నాయి. దేశంలోని రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు తెలిపాయి. హెచ్‌యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం(రూ.2) పెంచింది. అలాగే, వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం(రూ.25) పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచినట్లు" పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?) -
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
వాషింగ్‌పౌడర్ నిర్మా.. వెనుక పెను విషాదం
చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్భాయ్ పటేల్. సాక్షి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటి వెనుక షెడ్డులో రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా కర్సన్భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం. ఊహించని విషాదం ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిర్మాకు శ్రీకారం ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్‌గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్‌పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. జింగిల్ మ్యాజిక్ ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్టైజ్మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్‌గా మారింది. కూతురిపై ప్రేమ నిర్మా అడ్వెర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది. నంబర్‌వన్ 2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది. విద్యారంగంలో నిర్మా నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. 40 వేల కోట్లకు పైమాటే ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు. -
వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్!
వాషింగ్టన్: టైడ్... అవాక్కయారా... అంటూ వచ్చే యాడ్ మనందరికీ సుపరిచితమే.. మీ దుస్తుల్లో మురికిని తొలగించి, తెల్లగా చేసే ఈ డిటర్జెంట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాకుండా, అంతరిక్షంలో కూడా వ్యోమగాములు ధరించే దుస్తుల్లో కూడా మురికిని తొలగించనుంది. భవిష్యత్తులో టైడ్ డిటర్జెంట్ మెరుపు శుభ్రతతో.. వ్యోమగాములను కూడా అవాక్కయేలా చేయనుంది. అందుకోసం టైడ్ డిటర్జెంట్‌ను ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్షంలో ఉతకడం కష్టం...! అంతరిక్షంలో నీటికి ఎక్కువగా కొరత ఉంటుంది. దీంతో వ్యోమగాములు ధరించిన దుస్తులను వాష్ చేయరు. వాటిని స్పేస్ స్టేషన్లో ఒక కవర్లో ఉంచి తిరిగి కొన్ని రోజుల తరువాత ధరిస్తారు. ఎక్కువగా మురికి అయితే వాటిని అంతరిక్షంలోనే వదులుతారు. దీంతో టన్నుల కొద్ది దుస్తులు వృథా అవుతాయి. కాగా ప్రస్తుతం పీ అండ్ జీ సంస్థ అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తుల మురికిని తొలగించడానికి ఒక డిటర్జెంట్ ఫార్ములాపై పనిచేస్తోంది. ఈ డిటర్జెంట్ ఫార్ములాతో సుమారు 15 లీటర్ల నీరును వాడి దుస్తుల మురికి తొలగించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నీటి వాడకాన్ని ఇంకా తగ్గించి దుస్తుల మురికి తీసే డిటర్జెంట్పై పీ అండ్ జీ పనిచేస్తోంది. అంతేకాకుండా అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్ ఏవిధంగా పనిచేస్తాయో విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. కొత్త డిటర్జెంట్ ఫార్ములాతో భారీగా నీరు పొదుపు.. సాధారణంగా డిటర్జెంట్‌తో మురికిని తొలగించడానికి సుమారు 70 లీటర్ల నీరు అవసరమౌతుందని పీ అండ్ జీ కంపెనీ తెలిపింది. వ్యోమగాములకు తయారుచేసే డిటర్జెంట్‌తో భూమ్మీద కూడా అతి తక్కువ నీటితో దుస్తుల మురికిని తీయవచ్చునని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా నీటిని పొదుపు చేయవచ్చునని పేర్కొంది. నాసా అంగారక గ్రహంపైకి మానవసహిత అంతరిక్షనౌకలను ప్రయోగించాలని చూస్తోంది. ప్రయోగ సమయంలో వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అంతరిక్షనౌకలో దుస్తులను తీసుకెళ్లడం అంతా సులువుకాదు. దీంతో నాసా ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ పీ అండ్ జీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే టైడ్ డిటర్జెంట్ వ్యోమగాములను కూడా అవ్వాకయ్యేలా చేస్తుంది. చదవండి: మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..! -
వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత దుస్తులు ఉతకడం చాలా సులువైపోయింది. కొంచెం అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఇంతకీ వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసా? వాషింగ్ మిషన్ అనేది విద్యుచ్ఛక్తి సాయంతో నడిచే ఒక గృహోపకరణం. దాదాపు అన్ని రకాల వాషింగ్ మిషన్లలోనూ గుండ్రటి డ్రమ్ము వంటిది ఉంటుంది. ఉతికిన దుస్తులను తీసి, ఇందులో వేస్తే, ఇది గిరగిరా తిరుగుతూ దుస్తులను నీళ్లు లేకుండా పిండుతుంది. ఇప్పుడు వస్తున్న అధునాతన వాషింగ్ మిషన్లలో అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో ముందుగా రూపొందించబడిన మెకానిజం ప్రకారం, మనం కొన్ని మీటలను నొక్కితే చాలు... దుస్తులను ఉతకడం, జాడించడం, పిండటం వంటివన్నీ అదే చేస్తుంది. విద్యుత్తుతో పని చేసే కవాటం లోపలి ద్వారంలో నీటిని పోయాలి. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే నీటి కుళాయికి అనుసంధానిస్తే చాలు, అదే కావలసినంత నీటిని తీసుకుంటుంది. నీరు కావలసినంత మట్టానికి చేరగానే, దానిని కనిపెట్టి, దానంతట అదే నీటి ధార ఆగిపోయేలా సెన్సర్లు ఉంటాయి. కవాటం లోపలి ద్వారంలో ఉండే నీటి పీడనం మూలంగా కవాటం దానంతట అదే మూసుకుపోతుంది. నీటిని వేడి చేయవలసిన అవసరం ఉంటే, అందులో ఉండే వేడి చేసే పరికరం (హీటర్) ద్వారా నీరు వేడెక్కుతాయి. ముందుగానే సెట్ చేసి ఉంచిన సెన్సర్ ద్వారా దానికి కావలసిన వేడిని చేరగానే నీరు వేడెక్కటం ఆగిపోతుంది. నీటిలో కలిపిన డిటర్జెంట్ పొడి సాయంతో మురికి పోయేలా డ్రమ్లోని దుస్తులను పరికరం అటూ ఇటూ వేగంగా తప్పుతుంది. శుభ్రపడిన దుస్తులు స్పిన్నింగ్ డ్రమ్ములోకి వెళతాయి. సెమీ ఆటో మేటిక్ అయితే మనమే వాటిని స్పిన్నింగ్ డ్రమ్ములోకి పంపించాలి. ఉతికిన దుస్తులలోని సర్ఫు నురగ పోయేలా బట్టలను ఆ పరికరం శుభ్రంగా జాడించి, అక్కడినుంచి బట్టలను ఎండబెట్టే డ్రయ్యర్‌లోకి పంపుతుంది. దుస్తులలోని నీరంతా పోయే వరకూ డ్రయ్యర్ వాటిని గట్టిగా పిండుతుంది. దుస్తులను పిండటం అయిపోయాక మనం వాటిని తీసి, గాలి లేదా ఎండ తగిలేలా ఆరవేయాలి. వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా గృహిణులకు చాలా శ్రమ తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది.