వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత దుస్తులు ఉతకడం చాలా సులువైపోయింది. కొంచెం అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఇంతకీ వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
వాషింగ్ మిషన్ అనేది విద్యుచ్ఛక్తి సాయంతో నడిచే ఒక గృహోపకరణం. దాదాపు అన్ని రకాల వాషింగ్ మిషన్లలోనూ గుండ్రటి డ్రమ్ము వంటిది ఉంటుంది. ఉతికిన దుస్తులను తీసి, ఇందులో వేస్తే, ఇది గిరగిరా తిరుగుతూ దుస్తులను నీళ్లు లేకుండా పిండుతుంది.
ఇప్పుడు వస్తున్న అధునాతన వాషింగ్ మిషన్లలో అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో ముందుగా రూపొందించబడిన మెకానిజం ప్రకారం, మనం కొన్ని మీటలను నొక్కితే చాలు... దుస్తులను ఉతకడం, జాడించడం, పిండటం వంటివన్నీ అదే చేస్తుంది. విద్యుత్తుతో పని చేసే కవాటం లోపలి ద్వారంలో నీటిని పోయాలి. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే నీటి కుళాయికి అనుసంధానిస్తే చాలు, అదే కావలసినంత నీటిని తీసుకుంటుంది. నీరు కావలసినంత మట్టానికి చేరగానే, దానిని కనిపెట్టి, దానంతట అదే నీటి ధార ఆగిపోయేలా సెన్సర్లు ఉంటాయి. కవాటం లోపలి ద్వారంలో ఉండే నీటి పీడనం మూలంగా కవాటం దానంతట అదే మూసుకుపోతుంది. నీటిని వేడి చేయవలసిన అవసరం ఉంటే, అందులో ఉండే వేడి చేసే పరికరం (హీటర్) ద్వారా నీరు వేడెక్కుతాయి. ముందుగానే సెట్ చేసి ఉంచిన సెన్సర్ ద్వారా దానికి కావలసిన వేడిని చేరగానే నీరు వేడెక్కటం ఆగిపోతుంది.
నీటిలో కలిపిన డిటర్జెంట్ పొడి సాయంతో మురికి పోయేలా డ్రమ్‌లోని దుస్తులను పరికరం అటూ ఇటూ వేగంగా తప్పుతుంది. శుభ్రపడిన దుస్తులు స్పిన్నింగ్ డ్రమ్ములోకి వెళతాయి. సెమీ ఆటో మేటిక్ అయితే మనమే వాటిని స్పిన్నింగ్ డ్రమ్ములోకి పంపించాలి. ఉతికిన దుస్తులలోని సర్ఫు నురగ పోయేలా బట్టలను ఆ పరికరం శుభ్రంగా జాడించి, అక్కడినుంచి బట్టలను ఎండబెట్టే డ్రయ్యర్‌లోకి పంపుతుంది. దుస్తులలోని నీరంతా పోయే వరకూ డ్రయ్యర్ వాటిని గట్టిగా పిండుతుంది. దుస్తులను పిండటం అయిపోయాక మనం వాటిని తీసి, గాలి లేదా ఎండ తగిలేలా ఆరవేయాలి. వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా గృహిణులకు చాలా శ్రమ తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది.