
ఇదిగో.. నిస్సాన్ కొత్త ‘టెరానో’..
ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
నోయిడా: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన ఎస్‌యూవీ ‘టెరానో’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.9.99 లక్షల నుంచి 13.6 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ఇదివరకు వాహనంతో పోలిస్తే తాజా టెరానోలో 22 కొత్త ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది. భద్రతా ఫీచర్లకు అధిక ప్రాధాన్యమిచ్చామని తెలిపింది. తాజా వేరియంట్ రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా నిస్సాన్ కంపెనీ టెరానో ఎస్‌యూవీని 2013లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ఎస్‌యూవీ విభాగం మాత్రమే కాదు...
నిస్సాన్ కంపెనీ కేవలం ఎస్‌యూవీ విభాగంపైనే కాకుండా ఇతర విభాగాలపైనా దృష్టి కేంద్రీకరించింది. ఎస్‌యూవీ మార్కెట్‌పై పట్టుకోసం కంపెనీ ఈ ఏడాదిలోనే తన టాప్‌ఎండ్ ఎస్‌యూవీ ఎక్స్‌ట్రైల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. తాము కేవలం ఎస్‌యూవీ విభాగంపైనే కాకుండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంపైనా దృష్టి కేంద్రీకరించామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గులౌమి సికార్డ్ తెలిపారు. ఇందులో భాగంగానే 2021 నాటికి ఎనిమిది కొత్త ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. భారత్‌లో సెడాన్ విభాగంలో కూడా వృద్ధి అవకాశాలున్నాయన్నారు. నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కింద పలు కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ ద్వారా 2021 నాటికి భారత్‌లోని కారు మార్కెట్‌లో 5% వాటాను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.