
తొలి స్థానంలో నిలిచిన నీతా అంబానీ
న్యూయార్క్ : ఆసియా మోస్ట్ పవర్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాతో రిలయన్స్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ మొదటిస్థానంలో నిలిచారు. 50 మంది మహిళా వ్యాపార వేత్తలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 2016 ఆసియా మోస్ట్ పవర్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. వీరిద్దరితో పాటు మరో ఆరుగురు భారతీయ మహిళలు ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.
మ్యూ సిగ్మా సీఈవో అంబిగా ధీరజ్(14), వెల్స్ పన్ ఇండియా సీఈవో దీపాళి గోయింకా(16), లుపిన్ సీఈవో వినితా గుప్తా(18), ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందాకొచ్చర్(22), వీఎల్ సీసీ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు వందనా లుత్రా(26), బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ కిరణ్ ముజుందర్ షా(28)లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా లింగవివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళలు వ్యాపార రంగంలో రాణించవచ్చనే సందేశాన్ని వీరు అందిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది.