సాక్షి, న్యూఢిల్లీ: కండోమ్ ప్రకటనలపై కేంద్రం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ‍్యంగా చిన్నపిల్లలను ఈ ప్రభావం నుంచి రక్షించేలా సోమవారం కొన్ని ఆంక్షలు విధించింది. చిన్న పిల్లలపై ప్రభావం చూపే ఆ యాడ్స్‌ను ఉదయం పూట ప్రసారం చేయరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కండోమ్ యాడ్స్‌పై ప్రకటనలు, వాటి ప్రసార సమయాలపై ఇటీవల ఇండియన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మంత్రిత్వ శాఖకు అందించిన సూచనల మేరకు ఈ దేశాలు జారీ అయ్యాయి.
కండోమ్ వాణిజ్య ప్రకటనలను ఉదయం వేళ ప్రసారం చేయరాదు అని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి అసభ్యకరమైన, అనారోగ్య పద్ధతులు సృష్టించగలవంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేయడానికి వీల్లేదని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖ ఆదేశించింది.
దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఉన్నా.. కొన్ని ఛానళ్లు కండోమ్ యాడ్స్ ప్రసారం చేస్తున్నాయని ఇటీవల విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ యాడ్స్‌ను ప్రసారం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్, 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కాగా గత సెప్టెంబరులో సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ ప్రకటన సూరత్‌లో నిరసన సెగలు రాజేసింది. గుజరాత్ నగరం అంతటా దర్శనమిచ్చిన ఈ హోర్డింగ్స్ పై సిటీకి చెందిన హిందూ యువ వాహిని నిరసనకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment