అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేత
దోహ : ప్రజలు కట్టే ఆదాయపు పన్నుల ద్వారానే ప్రభుత్వాలు సగం ఖర్చులను భరిస్తుంటాయి. కానీ సౌదీ అరేబియా తాజాగా ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సౌదీ సిటిజన్లు ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సినవసరం లేదని ప్రకటించింది. ఆదాయాలపై పన్ను కట్టాల్సినవసరం లేదని, కంపెనీలు కూడా వారి లాభాలపై ఎలాంటి పన్నులు భరించాల్సినవసరం లేదని సౌదీ ఆర్థికమంత్రి శనివారం వెల్లడించారు. అఖండ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆయిల్ రిచ్ దేశంలో వీటిని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. 2014 మధ్యకాలం తర్వాత భారీగా పతనమైన ఆయిల్ ధరలపై సమగ్రంగా, సమూలంగా పరిశీలించిన సౌదీ అరేబియా, కొత్త పన్నులు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల వ్యూహాలు మార్పు, ప్రభుత్వ ఖర్చుల్లో తగ్గింపు వంటి వాటిని చేపట్టింది.
ప్రస్తుత సంస్కరణల్లో భాగంగా సౌదీలు ఎలాంటి ఇన్ కమ్ ట్యాక్స్ ను కట్టాల్సినవసరం లేదని, సౌదీ కంపెనీల లాభాలు కూడా పన్నుల కిందకు రావని గుడ్ న్యూస్ చెప్పింది. వాల్యు యాడెడ్ పన్ను కూడా 5 శాతం కంటే ఎక్కువ పెంచడానికి వీలు లేకుండా ప్లాన్ చేస్తున్నామని సౌదీ ఆర్థికమంత్రి చెప్పారు. నాన్-ఆయిల్ రెవెన్యూలను పెంచుకోవడానికి 5 శాతం వాల్యు యాడెడ్ ట్యాక్స్ ను వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టబోతున్నామని ఆరు అరబ్ రాజరికాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పేర్కొంది.