సాక్షి, న్యూఢిల్లీ: 2 వేల రూపాయల నోటు కనుమరుగు కానుందన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2 వేల రూపాయల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల ముఖ్య అధికారులతో జరిగిన ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు బ్యాంకులకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదంటూ 2 వేల నోట్లకు సంబంధించి జరుగుతున్న పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్ట బద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను కేంద్రం గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో 2 వేల రూపాయల నోట్లను కూడా ఉపసంహరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఏటీఎంలలో 2 వేలు రూపాయల నోట్లను ఉంచకపోవడం కూడా ప్రచారానికి బలం చేకూర్చింది. 2 వేల రూపాయల నోట్లకు బదులు 500 రూపాయల నోట్లనే ఎటీఎంలలో ఉంచుతుండటంతో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment