స్మార్ట్ ఫోన్స్ తయారీ యోచన లేదు: పిచాయ్
న్యూయార్క్: ఇప్పటికిప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేయాలనీ ఉద్దేశం తమకు లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టంచేశారు. దీనికోసం ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్ (ఓఈఎం)తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మొబైల్స్ తయారీకి ఓఈఎంలతో పనిచేయాలనే ప్రణాళికనే అవలంబిస్తామని చెప్పారు. నెక్సాస్ ఫోన్లపై అధికంగా దృష్టి కేంద్రీకరించామని, భవిష్యత్తులో వీటికి మరిన్ని ఫీచర్లను జతచేస్తామని తెలిపారు.
గూగుల్.. నెక్సాస్ ఫోన్లలోని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అంశాలను మాత్రమే చూసుకుంటుందని, వాటి తయారీ బాధ్యతలను భాగస్వామ్య తయారీదారులకు అప్పగిస్తుందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ అనేది ఒక పెద్ద ఓపెన్ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. కాగా ఈయన ఇటీవల వాయిస్ యాక్టివేటెడ్ ప్రొడక్ట్ ‘గూగుల్ హోమ్’ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది గూగుల్ అసిస్టెంట్ అనే టెక్నాలజీని మన గదికి తీసుకువస్తుంది. ఆయన దీనితోపాటు మేసేజింగ్ యాప్ ‘అలో’, వీడియో కాలింగ్ యాప్ ‘డుయో’ సహా పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు.