
ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు ఏమైంది?
బెంగళూరు: ప్రతి ఏడాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కుప్పలు తెప్పలుగా విద్యార్థులు బయటికి వస్తున్నారు. ఐటిరంగంలో మురిపిస్తున్న జీతాలు, సౌకర్యాల నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే ఆశించినట్టుగా వీరికి మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయా అంటే...లేదనే చెప్పాలి. హ్యూమన్ రిసోర్స్ అధికారుల వెల్లడించిన డేటా ఇదే స్పష్టం చేస్తోంది.
ఇన్ఫోసిస్ , టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల పరిస్థతిపై పెదవి విరిస్తోందీ డాటా. ఇంజనీరింగ్ చదివిన వారికి సరిగ్గా ఉద్యోగాలు దొరకపోగా, కొత్తగా ఐటీ స్పేస్ లోకి ఎంపికయ్యే ఉద్యోగులకూ అసలు జీతాలు పెరగడం లేదట. రూ.16,000 కోట్ల (160బిలియన్ డాలర్ల) పరిశ్రమ కలిగిన ఐటీ ఇండస్ట్రీ, ఈ రెండు అంశాల్లో తీవ్ర నిరాశ పరుస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. టాప్ కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు చాలా ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనాలు పెంచడంలో అంత శ్రద్ధ తీసుకోవడం లేదని, అసలు వేతనాలను సవరించడం లేదని హ్యుమన్ రిసోర్స్ అధికారుల డేటా చెబుతోంది.గత మార్జిన్లను కాపాడుకోవడానికీ, పెరుగుతున్న ధరలను, కరెన్సీ మార్పులను సరిచూసుకోవడంపైనే ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని పేర్కొంటోంది.
గతేడాది వరకూ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మార్జినల్ వేతనాలను పెంచిన అమెరికా కంపెనీలు కాగ్నిజెంట్, టీసీఎస్ లు, ఈ ఏడాది కొత్త ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి సవరణ చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది కాగ్రిజెంట్ కంపెనీ రూ.3.05 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు ప్రెషర్లకు జీతాలు పెంచింది. టీసీఎస్ కూడా రూ.3.18లక్షల నుంచి రూ.3.30 లక్షలు పెంచింది.జీతాలు పెంచకుండా అలానే అంటిపెట్టి ఉంచడం వల్ల సీనియర్ ఇంజనీర్లు, మిడ్ లెవల్ మేనేజర్లపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
అవసరమైన దానికంటే ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులై వస్తుండడంతోనే, ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు.కాలేజీల్లో గ్రాడ్యుయేట్లగా ఉత్తీర్ణత సాధించే ప్రతి ఐదుమంది ఇంజనీర్లకు ఒక్కటే జాబ్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది భారత్ నుంచి పది లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తుంటే, వారికి కేవలం రెండు నుంచి మూడు లక్షల జాబ్ లు మాత్రమే ఉన్నాయని నాస్కామ్ సర్వే వెల్లడించింది.పదేళ్ల క్రితం డిమాండ్, సప్లై సమానంగా ఉండేదని, ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తే, అన్ని ఉద్యోగాలు ఉండేవని సర్వే తెలిపింది. దీంతో ఉద్యోగాల కొరతే ఏర్పడలేదని పేర్కొంది.