నోకియా తొలి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది... | Nokia launches Android phone 'X' in India for Rs. 8599 | Sakshi
Sakshi News home page

నోకియా తొలి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది...

Published Tue, Mar 11 2014 12:59 AM | Last Updated on Sat, Aug 18 2018 4:50 PM

నోకియా తొలి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది... - Sakshi

నోకియా తొలి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది...

 నోకియా ఎక్స్ @రూ.8,599
 
 న్యూఢిల్లీ: నోకియా కంపెనీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్, ఎక్స్‌ను భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. నోకియా కంపెనీ నుంచి వస్తోన్న ఈ తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ధర. రూ.8,599. నోకియా నాణ్యత, స్కైప్, అవుట్‌లుక్ వంటి మైక్రోసాఫ్ట్ సర్వీసులు, ఆండ్రాయిడ్ యాప్‌లు కలగలిపి వినూత్న సమ్మేళనంగా ఈ నోకియా ఎక్స్ ఫోన్‌ను రూపొందించామని  నోకియా ఇండియా ఎండీ పి. బాలాజీ తెలిపారు.  మరో రెండు నెలల్లో ఈ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్‌లు ఎక్స్ ప్లస్, ఎక్స్‌ఎల్‌లను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు.
 
  స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటని, అందుకని మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ప్రస్తుతం చౌక ధరల్లో తామందిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు-ఆశా ఫోన్లకు ఈ నోకియా ఎక్స్ ఫోన్లు పోటీ కావని ఆయన స్పష్టం చేశారు. ఆశ, లూమియా, ఎక్స్ - ఈ మూడు విభిన్న రకాలైన ఫీచర్లతో కూడిన ఫోన్ కేటగిరీలని ఆయన వివరించారు. నోకియా ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేస్తున్నప్పటికీ, ఈ ఫోన్ యూజర్లు గూగుల్ యాప్ మార్కెట్ అయిన గూగుల్ ప్లే నుంచి యాప్‌లను డెరైక్ట్‌గా యాక్సెస్ చేసుకోవడానికి లేదు. వన్‌మొబైల్ మార్కెట్, సైడ్‌మి మార్కెట్, ఆప్‌టోయిడ్ యాప్‌స్టోర్ తదితర థర్డ్-పార్టీ యాప్ స్టోర్స్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్ సిరీస్‌లో ఇదే చౌకైన ఫోన్ కావడం గమనార్హం.
 
 నోకియా ఎక్స్ ప్రత్యేకతలు...
 డ్యుయల్ సిమ్ నోకియా ఎక్స్‌లో 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 3 మెగా పిక్సెల్ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ బరువు 128 గ్రాములు. పాలీకార్బొనేట్ రిమూవబుల్ బ్యాక్ కవర్‌తో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది. బీబీఎం, వైన్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ప్రి లోడెడ్‌గా కంపెనీ అందిస్తోంది.  పసుపు, ఎరువు, నలుపు, తెలుపు, సియాన్ రంగుల్లో లభ్యం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement