షెల్ కంపెనీలను అనుమతించం | Not allow shell companies | Sakshi
Sakshi News home page

షెల్ కంపెనీలను అనుమతించం

Published Sat, Jun 20 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

షెల్ కంపెనీలను అనుమతించం

షెల్ కంపెనీలను అనుమతించం

భారత్‌కు మారిషస్ హామీ
 
 న్యూఢిల్లీ : ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (డీటీఏసీ) ద్వారా లబ్ధి పొందాలనుకునే షెల్ (మారు) కంపెనీల ఏర్పాటుకు తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబోమని మారిషస్ ఆర్థిక మంత్రి సీతానా లచ్మినరాయుడు భారత్‌కి హామీ ఇచ్చారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే విధమైన కార్యకలాపాలు సాగించేందుకు వచ్చే భారతీయ ఇన్వెస్టర్లనే తాము కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటు భారత్‌కి గానీ, అటు మారిషస్‌కి గానీ షెల్ కంపెనీలు ఉపయోగపడవని, అందుకే వాటిని తాము కోరుకోవడం లేదన్నారు.

దశాబ్దాల క్రితం నాటి డీటీఏసీని సవరించేందుకు ఉద్దేశించి తదుపరి విడత చర్చలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  డీటీఏసీకి సంబంధించి మారిషస్‌పై దురభిప్రాయం సరికాదని, తమ దేశ ఆర్థిక రంగం పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉందని మంత్రి వివరించారు. డీటీఏసీ మూలంగా తమ దేశం ద్వారా భారత్‌కి కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీని వల్ల ఉపాధి అవకాశాలపరంగా మారిషస్ కూడా లబ్ధి పొందిందని చెప్పారు.  డీటీఏసీ సవరణలకు సంబంధించి జూన్ 29-30న ఇరు దేశాల అధికారులు సమావేశం కానున్నట్లు తెలిపారు. తమ దేశ ఫిషరీస్, పోర్టులు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ భారత ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

 ‘స్వచ్ఛ మారిషస్’..: పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన కార్యక్రమం(స్వచ్ఛ భారత్) తరహాలోనే తాము కూడా తమ దేశంలో వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును బస్తాల కొద్దీ తీసుకొచ్చి దాచుకోవాలనుకువారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయమివ్వబోమని మారిషస్ ఆర్థిక మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement