ఐఐపీ గణాంకాలు వాస్తవికంగా లేవు: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలకు సంబంధించి విడుడల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు (ఐఐపీ) లోపాలతో కూడుకున్నవిగా రేటింగ్స్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఇవి భారత తయారీ రంగం వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
అదే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెలారంభంలో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 1.81 శాతం క్షీణించగా, పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి నెల నవంబర్‌లో మాత్రం 5.7 శాతం వృద్ధిని నమోదు చేయడంపై క్రిసిల్ సందేహాలు వ్యక్తం చేసింది. అయితే, ఆటో వంటి పలు రంగాలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఏ విధంగా ఉందన్నది డిసెంబర్ నెల గణాంకాల్లో మరింతగా ప్రస్ఫుటం కానుందని పేర్కొంది.
ప్రతికూలంగా ఉండొచ్చు...
‘‘గతేడాది నవంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు చాలా ఎక్కువగా సూచిస్తోంది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తొలి నెల కావడంతో ఐఐపీ ప్రతికూలంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఐఐపీ 1.8 శాతం క్షీణించింది. నవంబర్‌లో ఒక్కసారిగా పెరిగిపోయింది’’ అని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది.