
ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్
రూ.15 లక్షల వరకు తక్షణ ఆమోదం
ముంబై: ఏటీఎంలు అంటే క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ చెకప్ వంటి సేవలు మాత్రమే కాదు. అంతకు మించి అంటోంది దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ. ఇది తాజాగా రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ వినూత్నమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం పొందొచ్చంటోంది బ్యాంక్. ఇవి అందరికీ కాదండోయ్.. వేతనం అకౌంట్ కలిగి ఉన్న వారికే.
అయితే ఇక్కడ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీఅందుబాటులో ఉంటాయి.