ఏటా రూ.2.30 లక్షలు పంపుతున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ప్రతీ ఏటా ఇంటికి సగటున రూ. 2.30 లక్షలు పంపుతున్నారట.అంతేకాదు ఇలా విదేశాలకు వెళ్ళడం ద్వారా కుటుంబ ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా, జీవన ప్రమాణాలు కూడా పెరిగినట్లు మనీ ట్రాన్సఫర్ సేవలు అందించే వెస్ట్రన్ యూనియన్ సర్వే పేర్కొంది.
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం రెమిటెన్స్‌ల్లో (స్వదేశానికి నగదు పంపడం) ఇండియానే మొదటి స్థానంలో నిలిచింది. 2013లో ఎన్నారైలు ఇండియాకి పంపిన మొత్తం రూ. 4.24 లక్షల కోట్లు కాగా, 2014లో రూ.4.36 లక్షల కోట్లు పంపినట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. గత ఇరవైఏళ్లుగా ఇండియాలో మనీ ట్రాన్సఫర్ సేవలను అందిస్తున్న వెస్ట్రన్ యూనియన్ ఏటా నగదు పంపుతున్న సుమారు 3,000 మందిపై సర్వే నిర్వహించింది.
గతేడాది కనీసం రూ. 50,000 తక్కువ కాకుండా పంపిన వారు, అలాగే ఏడాదిలో కనీసం మూడు సార్లు పంపిన వారిని ఈ సర్వేకి కోసం ఎంపిక చేసినట్లు వెస్ట్రన్ యూనియన్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో ముఖాముఖిన జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
ఆ వివరాలు...
ఏటా ఇండియాకి పంపుతున్న సగటు నగదు విలువ రూ. 2.30 లక్షలు.
ఈ నగదును కుటుంబ సభ్యులు రోజువారి అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు వంటి 3 ప్రధాన అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
విదేశాలకు వలస వెళ్లిన వారిలో 56% మంది ఉన్నత అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లగా, 40 శాతం మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లారట.
వీరిలో 87% మందికి శాశ్వత ఉద్యోగం లభించింది. ఇందులో 47% మంది వైట్ కాలర్ జాబ్స్.. 40% బ్లూకాలర్ జాబ్స్ చేస్తున్నారు.
విదేశాలకు వెళ్లిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తగ్గాయని 77 శాతం మంది పేర్కొన్నారు.
63% మంది జీవన ప్రమాణాలు మెరుగైనట్లు తెలిపారు. వచ్చిన డబ్బును 80% మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండగా, 50% మంది బీమా పథకాలను కొనుగోలు చేస్తున్నారు.