న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,439 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం రూ.2,497 కోట్లతో పోలిస్తే 2 శాతం క్షీణత నమోదైందని ఎన్‌టీపీసీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,589 కోట్ల నుంచి రూ.19,960 కోట్లకు పెరిగింది.
తరుగుదల వ్యయాలు రూ.1,434 కోట్ల నుంచి రూ.1,713 కోట్లకు, వడ్డీ వ్యయాలు రూ.890 కోట్ల నుంచి రూ.919 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ పరంగా నికర లాభం రూ.4,837 కోట్ల నుంచి రూ.5,057 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.38,809 కోట్ల నుంచి రూ.40,502 కోట్లకు పెరిగిందని ఎన్‌టీపీసీ తెలిపింది.
సగటు టారిఫ్ ఒక్కో యూనిట్‌కు రూ.3.21
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో సగటు టారిఫ్ ఒక్కో యూనిట్‌కు రూ.3.21గా ఉందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 125.14 బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుదుత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 129.45 బిలియన్ యూనిట్లకు పెరిగిందని, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 77.98 శాతం నుంచి 77.81 శాతానికి తగ్గిందని తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 47,228 మెగావాట్లుగా ఉన్న గ్రూప్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 51,708 మెగావాట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌టీపీసీ షేర్ స్వల్పంగా లాభపడి రూ.177 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment