వంద కోట్లకు విమాన ప్రయాణికులు! | The number is five times the number | Sakshi
Sakshi News home page

వంద కోట్లకు విమాన ప్రయాణికులు!

Published Thu, Mar 15 2018 12:27 AM | Last Updated on Thu, May 24 2018 3:02 PM

The number is five times the number - Sakshi

మంత్రి జయంత్‌ సిన్హా 

న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. వచ్చే 15–20 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందని, వంద కోట్లకు చేరగలదని పౌర విమానయాన శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం కొత్తగా మరిన్ని విమానాశ్రయాల నిర్మాణం, సిబ్బందికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా బుధవారం ఏఐఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. కేవలం విమానాలే కాకుండా హెలికాప్టర్లు, సీ ప్లేన్లు, ప్యాసింజర్‌ డ్రోన్స్‌ మొదలైన వాటిలో ప్రయాణించే వారంతా కూడా ఈ వంద కోట్ల ప్రయాణికుల్లో ఉంటారని పేర్కొన్నారు. 2013లో పది కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2017లో ఇరవై కోట్లకు చేరినట్లు సిన్హా వివరించారు.     130 కోట్ల దేశ జనాభాలో ప్రస్తుతం కేవలం అయిదు శాతం మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు.
 
రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం.. 

భారీ లక్ష్య సాధనకు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని సిన్హా వివరించారు. 100 కోట్ల విమాన ప్రయాణికుల లక్ష్యాన్ని సాధించేందుకు రూ. 4 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఏవియేషన్‌ రంగంలో ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా 12 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. వచ్చే కొన్నేళ్లలో ఇది 60 లక్షలకు చేరగలదన్నారు. అలాగే ఏవియేషన్‌ రంగం ఆదాయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి 15–20 ఏళ్లలో రూ.8–10 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. భారీగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్‌ డ్రోన్స్‌ విభాగం.. రాబోయే రోజుల్లో ఏకంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నారు. ఈ విభాగంలో ఆధిపత్యం దిశగా ప్రమాణాలు, నిబంధనల రూపకల్పన, టెక్నాలజీ మొదలైన వాటిపై కేంద్రం దృష్టి సారిస్తోందని సిన్హా వివరించారు.  

మేకిన్‌ ఇండియా విమానాలు.. 
విమానాలు, డ్రోన్ల తయారీని కూడా మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగం చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. మరికొన్నేళ్లలో భారత్‌కు 1,300 విమానాలు అవసరమవుతాయని ఆయన వివరించారు. ‘ఈ 1,300 విమానాలను విదేశాల నుంచి తెచ్చుకోవాలనుకోవడం లేదు. వీటిని భారత్‌లోనే తయారు చేస్తాం‘ అని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణ శాఖ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని పని చేయనున్నట్లు ఆయన వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement