
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ వ్యాపార విక్రయానికి లైన్ క్లియర్ అయింది. నష్టాల్లో ఉన్న ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్ లిమిటెడ్(ఈడబ్ల్యూపీఎల్)ను కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించే ఒప్పందానికి చమురు–గ్యాస్ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) కొద్ది వారాల క్రితం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని పీఎన్‌జీఆర్‌బీ చైర్మన్ దినేష్ కె షరాప్ వెల్లడించారు. గతంలో రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ పేరు తర్వాత ఈడబ్ల్యూపీఎల్‌గా మారింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బేసిన్‌లో వెలికి తీసే గ్యాస్‌ను తరలించేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి గుజరాత్‌లోని బారుచ్ వరకూ 1,400 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను దశాబ్దం క్రితం నిర్మించారు. రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను రవాణా చేసే సామర్థ్యంతో ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయగా... ఇప్పుడు ఇందులో 5 శాతం సామర్థ్యంతోనే ఇది నడుస్తోంది. రిలయన్స్ కేజీ–డీ6 క్షేత్రంలో అంచనాలతో పోలిస్తే భారీగా గ్యాస్ ఉత్పత్తి దిగజారడమే దీనికి కారణం.
ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలిపింది. ఒప్పందం విలువను ఇరు కంపెనీలు బయటికి వెల్లడించలేదు. కాగా, భారత్ ఇంధన రంగంలో బ్రూక్‌ఫీల్డ్‌కు ఇదే తొలి పెట్టుబడి కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఈడబ్ల్యూపీఎల్ రూ.884 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.715 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment