రూ.3,299 కోట్లు సమీకరించిన ఓలా
రోజుకి పది లక్షల బుకింగ్ రిక్వెస్ట్‌లు
ఏడాది కాలంలో 30 రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా వివిధ ఇన్వెస్టర్ల నుంచి 50 కోట్ల డాలర్ల(రూ.3,299 కోట్లు) పెట్టుబడులు (సిరీస్ ఎఫ్ ఫండింగ్) సమీకరించింది. బెయిలి గిఫోర్డ్, టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, చైనాకు చెందిన డిడి కవుడి, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, డీఎస్‌టీ గ్లోబల్ తదితర సంస్థల నుంచి ఈ పెట్టుబడులు సమీకరించామని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. అమెరికాకు చెందిన ఉబర్, దేశీయ ట్యాక్సీ అగ్రిగేటర్ మేరుల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఓలా షేర్, ఓలా ప్రైమ్, ఓలా మనీ వంటి వినూత్నమైన సొల్యూషన్ల ద్వారా మరింత వృద్ధి సాధించడానికి ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో 30 రెట్ల వృద్ధిని సాధించామని, ప్రస్తుతం రోజుకి పది లక్షల బుకింగ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయని వివరించారు. సింగపూర్‌కు చెందిన సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ నుంచి కూడా నిధులు వచ్చాయని సమాచారం. దీంతో ఈ కంపెనీ విలువ 500 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. తాజా పెట్టుబడులతో కలుపుకొని ఇప్పటివరకూ 130 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఓలా సమీకరించింది. భారత్‌లో 102 నగరాల్లో సేవలందిస్తున్న ఓలా ప్లాట్‌ఫామ్‌పై 3,50,000కు పైగా నమోదిత వాహనాలున్నాయి.