హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరులో అత్యాధునిక బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌ను (బీఐసీ) ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోమవారం కంపెనీ ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సెల్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదేనని వెల్లడించింది. 165 రకాల ప్రత్యేక, ఆధునిక విభిన్న ల్యాబ్ పరికరాలతో ఈ కేంద్రం కొలువుదీరనుందని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. బ్యాటరీ ప్యాక్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్ అన్నీ కూడా ఒకే గొడుకు కింద ఉంటాయని చెప్పారు.
పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్‌డీ, ఇంజనీరింగ్ అభ్యర్థులతోసహా అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఓలా నియమించుకోనుంది. వీరికి మరో 1,000 మంది పరిశోధకులు సహాయకులుగా ఉంటారు. ఇటీవలే లిథియం అయాన్ సెల్‌ను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్ సెల్ ఇదే. 2023 నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment