వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రమాదంలో పడ్డారు. వన్‌ప్లస్ క్రెడిట్ కార్డు సమాచారం అటాక్‌కు గురైందని, దీంతో దాదాపు 40వేల మంది వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రమాదంలో పడ్డారని కంపెనీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జరిపే తమ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై మోసపూరిత ఛార్జీలను విధిస్తున్నారంటూ చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ అటాక్ విషయం వెలుగులోకి వచ్చింది. సైటులోని పేమెంట్ పేజీలోకి హానికరమైన కోడ్‌ను చొప్పించారని, దీంతో ఈ ఘటనలు జరుగుతున్నట్టు చైనీస్ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ అధికారుల విచారణ రిపోర్టు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ కూడా అధికారికంగా ప్రకటించేసింది. '' మా సిస్టమ్స్‌లో ఒకటి అటాక్ గురైంది. మా క్రెడిట్ కార్డు సమాచారాన్ని దొంగలించడానికి పేమెంట్ పేజ్ కోడ్‌లోకి హానికరమైన స్క్రిప్ట్‌ను చొప్పించారు. ఈ హానికరమైన స్క్రిప్ట్ యూజర్ల బ్రౌజర్ నుంచి నేరుగా డేటాను వారికి పంపుకుంటోంది. దీన్ని ప్రస్తుతం తొలగించాం'' అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ హానికరమైన స్క్రిప్ట్‌ను బారిన పడిన వినియోగదారులందరికీ హెచ్చరికలు పంపుతున్నామని, అంతేకాక ప్రభావితమైన సర్వర్‌ను నిర్భదించామని కంపెనీ పేర్కొంది. 2017 నవంబర్ మధ్య నుంచి 2018 జనవరి 11 వరకు ఎవరైతే, వన్‌ప్లస్.నెట్‌లో తమ క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎంటర్ చేశారో ఆ వినియోగదారులు దీని బారిన పడినట్టు కూడా తెలిపింది. వినియోగదారుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక సమాచారం నెంబర్లు, తుది గడువు తేదీలు, సెక్యురిటీ తేదీలను స్కామర్లు పొందినట్టు తాము నమ్ముతున్నట్టు చెప్పింది. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చాక, ఈ కంపెనీ తన వినియోగదారులకు సంబంధించిన డేటాను యాక్సస్ చేసుకోవడానికి చైనీస్ అథారిటీలకు అనుమతి ఇస్తున్నట్టు కూడా వెల్లడైంది. వినియోగదారుల క్రెడిట్ కార్డులపై ఏమైనా అనుమానిత లావాదేవీలు జరిగినట్టు తెలిస్తే, వెంటనే కంపెనీని సంప్రదించమని కూడా వన్‌ప్లస్ ఆదేశిస్తోంది. ప్రస్తుతం తమ క్రెడిట్ కార్డు పేమెంట్ సిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు తమ పేమెంట్ ప్రొవైడర్లు పనిచేస్తున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment