హెచ్‌పీసీఎల్ కొనుగోలు డీల్...
25వేల కోట్లు సమీకరిస్తున్న ఓఎన్‌జీసీ
► ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు
► కంపెనీ చరిత్రలో తొలిసారి రుణ సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు–గ్యాస్ దిగ్గజం ఓఎన్‌జీసీ భారీస్థాయిలో రుణ సమీకరణకు సమాయత్తమవుతోంది. మరో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ హెచ్‌పీసీఎల్‌లో కేంద్రానికి ఉన్న 51.11 శాతం వాటాను దక్కించుకోవడం కోసం ఓఎన్‌జీసీ డైరెక్టర్ల బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కొనుగోలు కోసం దాదాపు రూ.37 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్‌జీసీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో స్వదేశీ/విదేశీ మార్కెట్ల నుంచి బాండ్‌లు, నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు ఇతరత్రా రుణ పత్రాల రూపంలో రూ.25 వేల కోట్ల మొత్తాన్ని సమీకరించడం కోసం త్వరలో వాటాదారుల అనుమతి కోరనుంది. రూపాయి లేదా విదేశీ కరెన్సీ రుణాలు లేదా ఈ రెండింటి ద్వారా ఈ రుణ సమీకరణ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 27న జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ రుణ సమీకరణపై వాటాదారుల ఓటింగ్ కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఓఎన్‌జీసీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ చరిత్రలో ఇదే తొలి రుణ సమీకరణ కావడం గమనార్హం.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఓఎన్‌జీసీకి ప్రస్తుతం 13.77% వాటా ఉంది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.28,800 కోట్లు. గెయిల్‌లో ఉన్న 4.83% వాటా విలువ ఇప్పుడు రూ.1,550 కోట్లు. అయితే, హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఇతర పీఎస్‌యూల్లోని తమ వాటాలను విక్రయించబోమని ఓఎన్‌జీసీ అధికారులు చెబుతున్నారు. డీల్‌కు విధివిధానాలు, సూచనలను బోర్డుకు అందించేందుకుగాను ఆరుగురు సభ్యులతో కంపెనీ ఒక కమిటీని నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే(వచ్చే ఏడాది మార్చి నాటికి) ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉంది.