ఫండ్స్‌ పెట్టుబడులకు ‘ఆన్‌లైన్‌ పోటీ’ | Online competition for funds investment | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ పెట్టుబడులకు ‘ఆన్‌లైన్‌ పోటీ’

Published Tue, Jul 17 2018 12:26 AM | Last Updated on Tue, Jul 17 2018 12:26 AM

Online competition for funds investment - Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు స్మార్ట్‌ఫోన్ల విస్తృతి, డేటా వినియోగం, మరో వైపు పెరుగుతున్న యువతరం ఆర్జనా శక్తి... ఇవన్నీ ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు జోష్‌నిస్తున్నాయి. ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఇదో ఆదాయ వనరుగా కనిపిస్తోంది. పేటీఎం, పైసాబజార్‌ కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. చెన్నై కేంద్రంగా ఆన్‌లైన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల సేవలు అందిస్తున్న ‘ఫండ్స్‌ ఇండియా’ సంస్థ వ్యాల్యూషన్‌ మూడేళ్లలోనే ఐదు రెట్లు పెరగడం గమనార్హం.

గ్రోవ్, నివేష్‌ డాట్‌ కామ్, ఓరోవెల్త్‌ తదితర సంస్థలు గత రెండు నెలల కాలంలో ఈ విభాగంలో వ్యాపార కార్యకలాపాల కోసం ప్రారంభ స్థాయి పెట్టుబడులను సమీకరించాయి. ఈక్విటీ మార్కెట్లు గత కొన్నేళ్లుగా ర్యాలీ చేస్తుండటంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడుల ప్రవాహం పెరిగింది.

అంతేకాదు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, టెక్నాలజీ పట్ల అవగాహన పెరగడం కూడా ఫండ్స్‌ వ్యాపారానికి కలిసొస్తోంది. దీంతో ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలు కల్పించే ఆన్‌లైన్‌ వేదికలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు, వేగంగా వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడం ద్వారా తమ విలువను పెంచుకునే వ్యూహాలనూ అమల్లో పెడుతున్నాయి.

ఫండ్స్‌ ఇండియా ఓ నిదర్శనం
ఫండ్స్‌ ఇండియాలో వాటాల విక్రయానికి ఆదిత్య పరేఖ్‌ ఆధ్వర్యంలోని ఫేరింగ్‌ క్యాపిటల్, ఇతర ఇన్వెస్టర్లతో సంప్రదింపులు మొదలు పెట్టిందని సమాచారం. 2015లో ఫండ్స్‌ ఇండియాలో ఫేరింగ్‌ క్యాపిటల్‌ రూ.70 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. నాటి నుంచి చూసుకుంటే, 2012–13లో ఫండ్స్‌ ఇండియా సంస్థ ఆదాయం రూ.2.9 కోట్లు. 2016–17 నాటికి 10 రెట్లు పెరిగి రూ.30 కోట్లకు చేరుకుంది. డిజిటల్‌ వేదికగా ఎక్కువ ఆస్తుల బేస్‌ కలిగినది ఫండ్స్‌ ఇండియానే. రూ.4,300 కోట్ల రూపాయిల పెట్టుబడులను నిర్వహిస్తోంది.  

పీఈ సంస్థల ఆసక్తి
ఆన్‌లైన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో పెట్టుబడులకు ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు సలహాలు కోరుతూ తమకు నిత్యం కాల్స్‌ వస్తున్నాయని ఓ ఫండ్‌హౌస్‌ సీఈవో తెలిపారు.

‘‘ఎన్నో వ్యయాలతో కూడుకున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫిజికల్‌ వ్యాపారంలో వృద్ధి చాలా కష్టం. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అయితే వృద్ధికి అవకాశాలు అపారం. డిజిటల్‌ప్లాట్‌ఫామ్‌లు కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారితోపాటు, అప్పటికే చేరి ఆదాయం పొందుతున్న యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. వారు టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉంటున్నారు’’ అని మార్నింగ్‌ స్టార్‌లో ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కౌస్తభ్‌ బేలపుర్కార్‌ తెలిపారు.


వ్యాపారం కోసం నిధుల సమీకరణ
‘గ్రో’ సంస్థ ఇటీవలే రూ.11 కోట్లు సమీకరించింది. నివేష్‌ డాట్‌ కామ్‌ సైతం ఈ ఏడాది జూన్‌ నెలలో రూ.3 కోట్లను సీడ్‌ ఫండ్‌గా లెట్స్‌ వెంచర్‌ నుంచి సేకరించింది. ఏంజెల్‌ ఇన్వెస్టర్లు అయిన గూగుల్‌ ఇండియా ఎండీ రాజన్‌ ఆనందన్, ఇన్ఫోసిస్‌ మాజీ గ్లోబల్‌ సేల్స్‌ హెడ్‌ బసబ్‌ ప్రధాన్‌ సైతం పెట్టుబడులు పెట్టారు.

వెల్త్‌మేనేజ్‌మెంట్‌ స్టార్టప్‌ ఓరోవెల్త్‌ కూడా ఈ ఏడాది మే నెలలో రూ.11 కోట్లను సమీకరించింది. ఇక కార్పొరేట్‌ రంగంలో పేరున్న సంస్థలు కూడా ఇప్పటికే ఈ రంగంలో కాలు మోపాయి. ఆదిత్య బిర్లా మనీ 1,850 కోట్ల మేర పెట్టుబడులకు వేదికగా నిలవగా, జెరోదా (రూ.110 కోట్లు), ఈటీ మనీ (96.1 కోట్లు) చొప్పున ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను తమ వేదికగా నిర్వహిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement