
ఫ్రెష్ ఫుడ్ ఆఫర్ తో అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'ఫ్రెష్ ఫుడ్ ఆఫర్' ను తీసుకొచ్చేసింది. అతిపెద్ద బ్రిటైన్ సూపర్ మార్కెట్ల నుంచి రాబోతున్న పోటీని ముందుగా ఊహించి, ఆ పోటీని తట్టుకునేందుకు యూకే లో 'ఫ్రెష్ ఫుడ్ డెలివరీ సర్వీసులను' ఆవిష్కరిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ఆన్ లైన్ రిటైలర్స్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ సర్వీసులకు అదనపు చార్జీలతో అమెజాన్ ఫ్రెష్ ఫుడ్స్ ను లండన్ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. భవిష్యత్తులో రాబోతున్న పోటీని ముందుగా ఊహించిన అమెజాన్ ఈ సర్వీసులను తీసుకొచ్చింది. అతిపెద్ద రిటైలర్లుగా ఉన్న టెస్కో, సైన్సబరీ, అస్డా, మోరిసన్స్ లనుంచి ఉన్న ధరల పోటీని అధిగిమించి కిరాణారంగాన్ని చేజిక్కించుకోవాలని అమెజాన్ చూస్తోంది. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద డిస్కౌంట్ సూపర్ మార్కెట్ చైన్స్ అల్దీ, లిడ్ల్ ల నుంచి వస్తున్న ముప్పును కూడా అమెజాన్ తగ్గించుకోనుంది.
అమెజాన్ ఆఫర్ చేసిన తాజా ఆహార ఉత్పత్తుల్లో మోరిసన్స్ వి కూడా ఉన్నాయి. అతిపెద్ద బ్రాండ్ల ఉత్పత్తులు కోకో-కోలా, కెలోగ్స్, డానోన్, వాకర్స్ వంటి వాటిని కూడా ఈ ఆఫర్ కింద అమెజాన్ ఆన్ లైన్ లో ఉంచింది. లిమిటెడ్ ఏరియాలో ఈ ఆఫర్ ను ప్రారంభించామని, తమ మరింత సర్వీసులను మెరుగుపరుచుకుంటామని అమెజాన్ ఫ్రెష్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కవాన్ తెలిపారు. ఈ ఫ్రెష్ ఫుడ్ ఆఫర్ ను అమెరికాలో 2007లోనే అమెజాన్ ప్రవేశపెట్టింది. అనంతరం 2010లో కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ కు ఈ ఆఫర్ ను బ్రిటీష్ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అమెజాన్ ఈ ఆఫర్ ప్రకటించిన ఒక్కరోజులోనే యూకేలో మూడో అతిపెద్ద సూపర్ మార్కెట్ గా ఉన్న సైన్సబరీ, తన తాజా ఆర్థికసంవత్సరంలో అమ్మకాలు పడిపోయినట్టు వెల్లడించింది. అయితే ఆన్ లైన్ అమ్మకాలు 8శాతం పెరిగాయని పేర్కొంది. తన రిటైల్ స్సేస్ ను పెంచుకోవడానికి ఇప్పటికే సైన్సబరీ అమెజాన్ లో భాగమైపోయింది