
బి-స్కూల్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావట్లేదా?
న్యూఢిల్లీ : ఐఐఎమ్స్ లాంటి టాప్ బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే, మిగతా బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లుగా ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగాలు రావడం లేదట. ఒకవేళ వచ్చినా రూ.10వేలకు తక్కువగానే వేతనం పొందుతున్నారట. నాణ్యత నియంత్రణ, మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్యాంపస్ ప్లేస్ మెంట్లలో తక్కువ జీతం పొందడం, తక్కువ నైపుణ్యమున్న వారు ఫ్యాకల్టీగా ఉండటం బిజినెస్ స్కూళ్ల పరిస్థితిని దిగజారుస్తున్నాయని అసోచామ్ అధ్యయనంలో వెల్లడించింది.
భారత్ లో కనీసం 5,500 బిజినెస్ స్కూళ్లు నడుస్తుండగా, వాటిలో చాలా అనుమతి పొందని ఇన్ స్టిట్యూట్లే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. భారత బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వాళ్లలో కేవలం 7శాతం మందే ఉద్యోగవకాశాలు పొందుతున్నారని తెలిపింది. గత రెండేళ్లలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం,ముంబై, కోల్ కత్తా,బెంగళూరు,అహ్మదాబాద్,లక్నో, హైదరాబాద్, డెహ్రడూన్ ప్రాంతాల్లో దాదాపు 220 బిజినెస్ స్కూల్ లు మూతపడ్డాయని సర్వేలో పేర్కొంది. ఈ ఏడాది 120పైగా బిజినెస్ స్కూల్ కనుమరుగవుతాయని రిపోర్టు నివేదించింది.
ఎడ్యుకేషన్ నాణ్యత తగ్గడంతో, క్యాంపస్ రిక్రూట్ మెంట్లు కూడా 2014-2016లో 45శాతం పడిపోయాయని పేర్కొంది. బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లుగా సీటు సంపాదించిన వారు, రెండేళ్లకి దాదాపు రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారని, కానీ వారు పొందే జీతం కేవలం రూ.8,000 నుంచి రూ.10,000ల మధ్యలో ఉంటుందని అసోచామ్ అధ్యయనంలో పేర్కొంది.