1500 కు పైగా లిస్టెడ్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీల బోర్డుల్లో ఓ మహిళా డైరెక్టర్ ను తప్పనిసరిగా నియమించుకోవాలంటూ సెబీ పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోని కంపెనీలపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దమైంది. సెబీ నిబంధనను బేఖాతరు చేసిన సుమారు1500 (బీఎస్సీలో 1375, ఎన్ఎస్సీలో 191) కంపెనీలపై జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేయనుంది. వీటిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం విశేషం.
మార్చి 31 నాటికి, బీఎస్సీలోని 5,451 కంపెనీలకు గాను 1,375 సంస్థలు సెబీ నిబంధనను పాటించడంలో విఫలమయ్యాయని స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ జయంత్ సిన్హా లోక్ సభ్ లో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.బీఎస్సీలో 1375 కంపెనీలలో 201 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని మిగిలిన 1,179 లను కంపెనీలను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అలాగే సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎన్ఎస్ఈ నుంచి 191 కంపెనీల్లో 42 యాక్టివ్ గా ఉండగా మిగిలిన 149 సంస్థలను సస్సెండ్ చేశామన్నారు. ఈ నాన్ - కంప్లైంట్ సంస్థలపై జరిమానా విధించనున్నట్టు తెలిపారు.
గత రెండేళ్లుగా గడువు కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చిన సెబీ ఈ మార్చి 31 వరకు చివరి గడువుగా పేర్కొంది. గడువు ముగిసినా సదరు నియామకంలో కంపెనీలు వైఫల్యం చెందడంతో ఈనిర్ణయం తీసుకుంది. కనిష్టంగా రూ.50,000 జరిమానా, తరువాత నాలుగు దశల వారీగా జరిమానా పెరుగుతూ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఇటీవల సెబీ తెలిపింది. వీటిని కంపెనీలు బేఖాతరు చేయడంతో కొంత గడువు విధించి, ఆ గడువు లోప తమ ఆదేశాలను అమలు చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో సెబీ సీరియస్ గా స్పందించింది.
సెబి నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం మహిళ ఎగ్జిక్యూటివ్ ,లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ లేదా ఇండిపెండెంట్, లేదా నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్లను గానీ మహిళా డైరెక్టర్లు నియమించుకోవచ్చన్నారు. సదరు డైరెక్టర్లు కచ్చితంగా ప్రమోటర్ల బంధువులై ఉండాలన్న కచ్చితమైన నిబంధన ఏదీ విధించలేదని జయంత్ సిస్హా స్పష్టం చేశారు.
మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ..2013 కంపెనీల చట్టం ప్రకారం అయా లిస్టెడ్ సంస్థలు తమ బోర్డులో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండేలా చూడాలని నిబంధన విధించింది. మహిళా సాధికారత, లింగ వివక్షను రూపుమాపేందుకు ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టుతెలిపారు. దీన్ని కచ్చితంగా అమలుచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో ఆయా కంపెనీలపై జరిమానా విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.