
వంటనూనెలపై దిగుమతి సుంకాలు పెంచాలి
♦ అప్పుడే దేశీ రైతులు, రిఫైనరీలకు ప్రయోజనం
♦ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ రిఫైనరీలు, రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే దిగుమతయ్యే వంటనూనెలపై సుంకాలు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ లుంకాడ్ అన్నారు. క్రూడ్, రిఫైన్డ్ నూనెల దిగుమతి సుంకాల మధ్య వ్యత్యాసం ప్రస్తుతం 7.5% మాత్రమే ఉందని, ఇది కనీసం 15 % ఉండాలని ఆయన వివరించారు. ప్రస్తుతం క్రూడ్ దిగుమతులపై 12.5%, రిఫైన్డ్ నూనెలపై సుమారు 20% మేర సుంకాలు ఉన్నాయని గురువారమిక్కడ మలేషియా ఇండియా పామాయిల్ సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రవీణ్ తెలిపారు.
దేశీయంగా ఏటా 20 మిలియన్ టన్నుల మేర వంటనూనెల డిమాండ్ ఉండగా, 14.5 మిలియన్ టన్నులు దిగుమతవుతోందని, ఇందులో 9.5 మి. టన్నులు పామాయిల్ ఉంటోందని ఆయన చెప్పారు. వంటనూనెల దిగుమతి బిల్లు సుమారు రూ. 70,000 కోట్ల పైచిలుకు ఉందని పేర్కొన్నారు. దేశంలో రిఫైనరీల మొత్తం సామర్థ్యం 2.5 మిలియన్ టన్నుల మేర ఉన్నప్పటికీ.. కేవలం 30% సామర్ధ్యాన్నే వినియోగించుకోవడం జరుగుతోందని ప్రవీణ్ చెప్పారు. వర్షపాతం మెరుగ్గా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు ఒక స్థాయిలోనే కదలాడవచ్చన్నారు.
700 డాలర్లకు పామాయిల్ ధర..
అంతర్జాతీయంగా ప్రస్తుతం 650 డాలర్లుగా ఉన్న టన్ను పామాయిల్ ధర సోయా ఉత్పత్తి తగ్గుదల అంచనాలు తదితర అంశాల కారణంగా 700 డాలర్లకు చేరొచ్చని సెమినార్‌లో పాల్గొన్న మలేషియా పామాయిల్ కౌన్సిల్ సీఈవో యూసఫ్ బసీరన్ తెలిపారు. భారత్‌కు గతేడాది 3.9 మిలియన్ టన్నుల మేర పామాయిల్ ఎగుమతి చేశామని, ఈసారి 4 మిలియన్ టన్నుల స్థాయి దాటొచ్చని చెప్పారు.