మర్యాదగా బకాయిలు కట్టండి.. | Pay Dues Honourably Or Face Coercive Action: Arun Jaitley to Mallya | Sakshi
Sakshi News home page

మర్యాదగా బకాయిలు కట్టండి..

Published Tue, Mar 29 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

మర్యాదగా బకాయిలు కట్టండి..

మర్యాదగా బకాయిలు కట్టండి..

లేదంటే కఠిన చర్యలు తప్పవు...
కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు
ఆర్థిక మంత్రి జైట్లీ హెచ్చరిక

న్యూఢిల్లీ: బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన బడా కార్పొరేట్ గ్రూపులు మర్యాదగా తమ బకాయిలను చెల్లిస్తే మంచిదని.. లేదంటే బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు చేపట్టే తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానంగా విజయ్ మాల్యా వంటి ఎగవేతదారులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వ్యక్తిగత కేసుల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. అయితే, మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరహా బడా కార్పొరేట్ సంస్థలు, గ్రూప్‌లు బ్యాంకులకు మర్యాదగా తమ బకాయిలను కట్టాల్సిందే.

బ్యాంకుల వద్ద మాల్యా గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీల ఆస్తులు తనఖాలో ఉన్నాయి. ఒకవేళ ఆయన గనుక బకా యిలు చెల్లించపోతే బ్యాంకులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ మొత్తం ఉదంతంపై సంబంధిత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ జరుపుతున్నాయి కూడా’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా వడ్డీతో కలిపి రూ. 9,000 కోట్లకు పైగానే బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాల్యా ఈ నెల 2న దేశం విడిచి బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే.

 అధిక వడ్డీరేట్లతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది...
భారత్‌లో వడ్డీరేట్లు చాలా అధికంగా ఉన్నాయని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. పీపీఎఫ్ ఇతర చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆర్థిక మంత్రి సమర్థించుకున్నారు. ‘ఇప్పుడు చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లలో డిపాజిట్ రేట్లు 8.7% వరకూ ఉన్నప్పటికీ...  పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవానికి ఈ రేట్లు 12-13% మేర ఉన్నట్లు లెక్క. దీని ప్రకారం చూస్తే రుణాలపై వడ్డీరేటు ఇప్పుడు 14-15%గా ఉంది. ఈ స్థాయిలో రుణాలపై వడ్డీరేటు ఉంటే  ప్రపంచంలోనే అత్యంత మందకొడి ఆర్థిక వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానిం చారు. కాగా, ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధింపు ప్రతిపాదపై స్పందిస్తూ.. ప్రజలు తాము దాచుకున్న మొత్తాన్నంతా ఖర్చుచేసేయకుండా, పన్నుల్లేని పెన్షన్ పథకాల్లోకి నిధులను మళ్లించే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేశామని చెప్పారు. ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రం దీన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement