సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు.
తిరుమలలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్‌కు మెయిల్ చేయాలి.
కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్‌రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం.
గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment