దొడ్ల డెయిరీ ఐపీఓకు సెబీ ఓకే | PE-backed Affle, Dodla Dairy among four firms to get SEBI nod for IPOs | Sakshi
Sakshi News home page

దొడ్ల డెయిరీ ఐపీఓకు సెబీ ఓకే

Published Tue, Oct 23 2018 1:17 AM | Last Updated on Tue, Oct 23 2018 1:17 AM

PE-backed Affle, Dodla Dairy among four firms to get SEBI nod for IPOs - Sakshi

న్యూఢిల్లీ: దొడ్ల డెయిరీ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ఐపీఓతో పాటు మరో మూడు కంపెనీలు– ఆఫిల్‌ ఇండియా, చాలెట్‌ హోటల్స్, హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓలకు కూడా పచ్చజెండా ఊపింది.  దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా సెబీ అనుమతించిన ఐపీఓల సంఖ్య 64కు    పెరిగింది.  

దొడ్ల డెయిరీ ఐపీఓ @ రూ.500 కోట్లు  
దక్షణ భారతదేశంలో ప్రముఖ డెయిరీ... దొడ్ల డెయిరీ ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 95.4 లక్షల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించనున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి,  డెయిరీ సంబంధిత సరంజామా కొనుగోలు చేయడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తాయి.  

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ సైజు రూ.650 కోట్లు  
ఆఫిల్‌ ఇండియా ఐపీఓలో భాగంగా రూ.90 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఈ కంపెనీలో వాటాలున్న సింగపూర్‌కు చెందిన ఆఫిల్‌ హోల్డింగ్స్‌ సంస్థ 55 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.650 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ ఆలోచన. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి.  

ఛాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ @  రూ.2,000 కోట్లు  
కె.రహేజా కార్పొరేషన్‌కు చెందిన ఆతిథ్య రంగ కంపెనీ, ఛాలెట్‌ హోటల్స్‌.. రూ.950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 2.46 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా జేఎమ్‌ ఫైనాన్షియల్, యాక్సిస్‌ క్యాపిటల్, మోర్గాన్‌ స్టాన్లీలు వ్యవహిస్తున్నాయి. మారియట్, రెనైసాన్స్‌ తదితర బ్రాండ్ల హోటళ్లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది.

హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓ సైజు రూ.500 కోట్లు  
హర్ష ఇంజినీర్స్‌ కంపెనీ ప్రెసిషన్‌ బేరింగ్‌ కేజ్‌లను తయారు చేస్తోంది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.370 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 13.25 లక్షల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ సైజు రూ. 500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్, ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు వ్యవహరిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement