న్యూఢిల్లీ : గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగో రోజు ఈ ధరలు 9 పైసల వరకు తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలపై సుదీర్ఘకాల పరిష్కారం కనుగొనాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని పక్కన పెట్టి, ప్రత్యామ్నాయ ఇంధన వాడకాలను చేపట్టాలని మంత్రి సూచించారు. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిన అనంతరం మంత్రి ఈ ప్రకటన చేశారు. తగ్గింపు ధరల అనంతరం లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.78.20గా, లీటరు డీజిల్ రూ.69.11గా ఉంది. ముంబైలో కూడా లీటరు పెట్రోల్ రూ.86.01 వద్ద, డీజిల్ రూ.73.58 వద్ద రికార్డయ్యాయి.
పుణేలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేపట్టిన విజయాలన్నింటిన్నీ ప్రస్తావించారు. ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాల పరిష్కారాన్ని వెతుకుతుందని చెప్పారు. ఇప్పటికే తాము పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీని నిలిపివేశామని, 8 కోట్ల మంది ఎల్‌పీజీ కనెక్షన్లను అందించామని చెప్పారు. ఇంతమంది ప్రజలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రధాన కారణం, పెట్రలో, డీజిల్‌పై సబ్సిడీ రద్దు చేయడమేనని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఇథనాల్, బయో-డీజిల్, బయో-పీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌లుగా చెప్పారు.
పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లను వెచ్చిస్తుందని, దీర్ఘకాలిక పరిష్కారంతో, ఈ వ్యయాలను తగ్గించుకోబోతున్నట్టు చెప్పారు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం హైబ్రిడ్ వాహనాలను రూపొందించడంలో తలమునకలయ్యాయని, ఇవి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడుస్తాయన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల కంటే వాటి ధరలు తక్కువేనని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నెలకు ఒక్కొక్కరూ రూ.4000 వరకు పొదుపు చేసుకోవచ్చన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్‌టీ కిందకి తీసుకొస్తే, ఇంధన ధరలను 8 రూపాయల వరకు తగ్గించవచ్చని కూడా తెలిపారు. మరోవైపు ఎల్‌పీజీ, ఇంధన ధరలు పెరగడంపై మోదీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెలరేగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment