చకచకా అనుమతులు!
పెట్టుబడులతో తరలిరండి...; అమెరికా టాప్ సీఈఓలతో ప్రధాని మోదీ
♦ భారత్‌లో అపార అవకాశాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి
♦ సంస్కరణల జోరు పెంచాలన్న సీఈఓలు..
♦ అడ్డంకులు తొలగించాలని స్పష్టీకరణ...
న్యూయార్క్ : భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి చకచకా నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా దిగ్గజ కార్పొరేట్లకు హామీనిచ్చారు. ఇక్కడున్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా వారిని ఆహ్వానించారు. పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని కూడా వారికి సూచించారు. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మేగజీన్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో తయారీ, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన 42 మంది దిగ్గజ సీఈఓలు ప్రధానితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు భారత్‌లో వ్యాపార నిర్వహణకు ఉన్న అడ్డంకులను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించినట్లు సమాచారం. ఆర్థిక సంస్కరణలు, పాలసీ నిర్ణయాల విషయంలో ప్రస్తుత చర్యల్లో వేగం పెంచాలంటూ సీఈఓలు మోదీని కోరారు. ఈ సీఈఓలు సారథ్యం వహిస్తున్న కంపెనీల మొత్తం విలువ 4.5 లక్షల కోట్ల డాలర్లు కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ డిన్నర్ జరిగింది.
సమస్యల ఏకరువు...
ప్రధానంగా భారత్‌లో సంక్లిష్టమైన నియంత్రణలు, అరకొర మౌలిక సదుపాయాలు, పన్నుల విధింపులో హేతుబద్దత లోపించడం, ప్రభుత్వ యంత్రాంగం(బ్యూరోక్రసీ)లో గందరగోళం వంటి అంశాలను సీఈఓలో మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు ఫార్చూన్ ఎడిటర్ అలన్ ముర్రే చెప్పారు. విందులో చర్చకు సమన్వయకర్తగా ఆయనే వ్యవహరించారు. వీటికి సత్వరం తగిన పరిష్కారాలను చూపాలని సీఈఓలు సూచించారు. సీఈఓల్లో ఒకరైతే ఏకంగా భారత్‌లో వ్యాపారం చేయడం సులువుకాదంటూ వ్యాఖ్యానించడం విశేషం.
అయితే వారి ఆందోళనలపై స్పందించిన మోదీ... వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని హామీనిచ్చారని ముర్రే వెల్లడించారు. ‘ప్రపంచం మాకోసం వేచిచూడదు. మీరు వెలిబుచ్చిన అంశాలన్నీ నాకు కూడా తెలుసు. త్వరలోనే వీటిని పరిష్కరించేందుకు కృషిచేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. ఒకవైపు చైనాలో ఆర్థిక మందగమనం, 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను పలువురు సీఈఓలు ప్రధానికి వెల్లడించినట్లు ముర్రే తెలిపారు.
భారత్‌కు ఎఫ్‌డీఐలు పెరిగాయ్...
భేటీ తర్వాత భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ... సీఈఓల్లో భారత్‌పట్ల చాలా ఉత్సాహం వ్యక్తమైందని చెప్పారు. కాగా, రౌండ్ టేబుల్ చర్చలో ఒక్కో సీఈఓ వెల్లడించిన అభిప్రాయాలు, వారి భారత్ ప్రణాళికలను మోదీ వినడంతో పాటు సమస్యల పరిష్కారానికి వారి నుంచి సూచనలను కూడా ఆహ్వానించినట్లు స్వరూప్ చెప్పారు. ‘ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే నా తొలి ప్రాధాన్యం, విధానాలను సరళీకరిస్తున్నాం. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు నిర్ణయాల్లో వేగం పెంచడమే మా లక్ష్యం. భారత్‌లో తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా’ అని టాప్ సీఈఓలతో మోదీ పేర్కొన్నారు. రక్షణ, బీమా తదితర పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐలు తగ్గుముఖం పట్టగా.. భారత్‌లో మాత్రం 40 శాతం వృద్ధి చెందాయని మోదీ తెలిపారు.
డిజిటైజేషన్, 4జీ సేవలపై దృష్టిపెట్టాలి...
ప్రధానికి అమెరికా మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజాల సూచన
భారత్‌లో 4జీ టెలికం నెట్‌వర్క్‌ను వీలైనంత వేగంగా విస్తరించడం, టెలివిజన్ సేవల డిజిటైజేషన్‌పై మరింత దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి అమెరికా మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ దిగ్గజాలు సూచించారు. మొబైల్ సేవల మౌలికసదుపాయాలను కూడా పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. భారత్ ఒక అవకాశాల గని అని, అదేవిధంగా సవాళ్లు కూడా అనేకం ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పెట్టుబడి ప్రణాళికల్లో ప్రాంతీయ భాషలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మోదీతో భేటీ అయిన మీడియా దిగ్గజాల్లో న్యూస్‌కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్దోక్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ మైఖేల్ సింటన్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ డేవిడ్ జస్లావ్, ట్వంటీఫస్ట్ సెంచురీ జేమ్స్ మర్దోక్; ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్, న్యూస్‌కార్ప్ సీఈఓ రాబర్ట్ థాంప్సన్, టైమ్‌వార్నర్ సీఈఓ జెఫ్ బ్యూకెస్ తదితరులు ఉన్నారు. ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో ఈ సీఈఓలు నేతృత్వం వహిస్తున్న కంపెనీల వాటా 40 శాతంగా అంచనా. ఉత్సాహం, అత్యంత సమర్థతతో కూడిన మోదీ సారథ్యానికి సీఈఓలు కితాబిచ్చారని అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా చర్యల ఆసరాతో భారత్‌లో డిజిటల్ విప్లవం పట్ల వారు ఎంతో ఆసక్తితో ఉన్నారని కూడా తెలిపింది. మరోపక్క, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు.
హాజరైన హేమాహేమీలు...
ప్రధానితో డిన్నర్‌కు ప్రపంచ ప్రఖ్యాత, దిగ్గజ కార్పొరేట్ కంపెనీల అధిపతులంతా వరుసకట్టారు. వారిలో ముఖ్యంగా లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్-సీఈఓ మారిలిన్ హ్యూసన్, ఫోర్డ్ ప్రెసిడెంట్-సీఈఓ మార్క్ ఫీల్డ్స్, ఐబీఎం చైర్మన్ గినీ రోమెటీ, పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి, డో కెమికల్స్ చైర్మన్ ఆండ్రూ లివెరిస్ వంటి హేమాహేమీలు ఉన్నారు. సిటీ గ్రూప్ చైర్మన్ మేఖేల్ ఓ నీల్, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగా, బోయింగ్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్, గోల్డ్‌మన్ శాక్స్ అధినేత గ్యారీ కాన్, బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ హామిల్టన్. శాన్‌డిస్క్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ మెహరోత్రా తదితరులు కూడా ఉన్నారు. డిన్నర్ తర్వాత టాప్ సీఈఓలతో మోదీ ప్రత్యేకంగా ఫొటో దిగారు.