న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం సోమవారం లీటరు పెట్రోల్‌పై 15 పైసలు ధర తగ్గింది. అదేవిధంగా లీటరు డీజిల్ ధరపై కూడా 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. కర్ణాటక ఎన్నికల అనంతరం నుంచి వరుసగా 16 రోజుల పాటు వాహనదారులకు వాత పెట్టిన చమురు సంస్థలు, ఆ అనంతరం మే 30 నుంచి తగ్గడం ప్రారంభించాయి. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 33 పైసలు తగ్గింది.
దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ధరల తగ్గింపు అమలవుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.82.59గా, డీజిల్ ధర రూ.74.97గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంకేతాలు కూడా ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయని. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే, పరిస్థితి పూర్తిగా మన అదుపులోకి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిందని చెప్పారు. రికార్డు స్థాయిలను చేధించిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కరాన్నే ఎంచుకునేలా ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment