పదికి 8 మార్కులు ఇస్తున్నాం: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు 10కిగాను 8 మార్కులు ఇస్తున్నట్టు ఫ్యాప్సీ తెలిపింది. వ్యవసాయ రుణాలకు రూ.10 లక్షల కోట్లు, ఇల్లు లేనివారికి 2019 నాటికి ఒక కోటి గృహాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.64,000 కోట్ల కేటాయింపుల వంటివి స్వాగతించే అంశాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ తెలిపారు. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ టి.ఎస్.అప్పారావు, మాజీ ప్రెసిడెంట్ వి.ఎస్.రాజు తదితరులతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మా ట్లాడారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద కేటాయింపులను రెండింతలు చేస్తూ రూ.2.44 లక్షల కోట్లు ప్రకటించారని, ఔత్సాహిక యువత తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఈ నిధులు దోహదం చేస్తాయన్నారు. మెట్రో రైల్ పాలసీతో హైదరాబాద్‌కు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
జీఎస్‌టీలో ఒకే స్లాబ్..
ప్రతిపాదిత జీఎస్‌టీలో ఒకే స్లాబ్ కింద పన్ను వసూలు చేయాలని రవీంద్ర మోదీ అన్నారు. లేదంటే వ్యాట్‌కు, జీఎస్‌టీకి పెద్ద తేడా ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ‘ఎగ్జిట్ పాలసీ ప్రకటిస్తారనుకున్న పరిశ్రమకు నిరాశ కలిగించారు. స్టార్టప్స్‌తోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు ఈ పాలసీ అమలవ్వాలి. రిస్క్ తీసుకోవాలంటే ఇది తప్పదు. సరుకు రవాణాపై బడ్జెట్‌లో దృష్టిసారించ లేదు. రూ.50 కోట్ల వరకు ఆదాయం ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఆదాయపు పన్ను 5 శాతం తగ్గించడం ఊరట కలిగించే అంశం. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిశ్రమ కుదేలైన మాట వాస్తవం. ఒకట్రెండు నెలల్లో ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది’ అని తెలిపారు.