వెస్పా స్కూటర్ @12 లక్షలు!
భారత్‌లో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం ఇటలీకి చెందిన పియాజియో ‘వెస్పా 946 ఎంపోరియో అర్మానీ’ స్కూటర్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.12.04 లక్షలు. దేశంలో అప్రీలియా ఎస్‌ఆర్‌ఎస్ 850 ఏబీఎస్ తర్వాత అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే. వెస్పా బ్రాండ్‌లో సైతం ఇదే ప్రీమియం మోడల్. తొలిసారిగా 2011 మిలన్ మోటార్‌షోలో దర్శనమిచ్చిన వెస్పా 946 ప్రపంచవ్యాప్తంగా వాహన ప్రియులను ఆకట్టుకుంది. ఇక 70వ వార్షికోత్సవం సందర్భంగా పియాజియో ఇండియా కొత్త ఎడిషన్ వెస్పా స్కూటర్‌ను రూ.96,500 ధరలో ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌లో 500 యూనిట్లనే భారత్‌లో విక్రరుుంచనున్నారు.
ఇదీ 946 ప్రత్యేకత..: విభిన్న హ్యాండిల్‌బార్, పైకి తేలినట్టుండే విశాలమైన సీటు ఇటాలియన్ దర్పం ఉట్టిపడేలా ఉంటుంది. 4స్ట్రోక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో పొందుపరిచారు. ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్, 3వాల్వ్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎల్‌ఈడీ లైట్లు, డబుల్ డిస్క్ బ్రేక్స్, 12 అంగుళాల చక్రాలు ఇతర ఫీచర్లు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్‌తోపాటు వాహనం జారిపోకుండా నియంత్రించే వ్యవస్థా ఇందులో ఉంది. లెదర్ హ్యాండిల్ గ్రిప్స్‌ను కుట్టడం మొదలు తుది పాలిష్ వరకు చేతితో చేసిందే.