
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి..
అధిక వృద్ధి రేటుతో ముందుకెడుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రష్యా ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
► ఇన్‌ఫ్రా, ఏరోస్పేస్ రంగాల్లో అవకాశాలు
► ఆర్థిక వృద్ధికి అనుకూల పరిస్థితులు కల్పించాం
► రష్యా సంస్థల సీఈవోలతో భేటీలో ప్రధాని మోదీ
మాస్కో: అధిక వృద్ధి రేటుతో ముందుకెడుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రష్యా ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఏరోస్పేస్, వజ్రాలు, ఇన్‌ఫ్రా తదితర రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. అధిక ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమైన సానుకూల పరిస్థితులను తమ ప్రభుత్వం కల్పించిందని సీఈవోల ఫోరం సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 7.4 శాతం వృద్ధి సాధించిందని, వృద్ధి జోరు నిలకడగా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కూడా పేర్కొన్నాయని మోదీ తెలిపారు.
వ్యాపారాలకు అనువుగా ఉండేలా పరిస్థితులను మెరుగుపర్చే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచించేలా.. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) గణాంకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక మొదలైనవి మెరుగ్గా ఉన్నాయన్నారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ‘భారత్‌లో అత్యుత్తమమైన మౌలిక సదుపాయాల కల్పనకు కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో దేశ ఎకానమీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. స్థిరమైన, పారదర్శకమైన పన్నుల విధానాన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు.
ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే మేకిన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా రష్యా కూడా ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. భారత వజ్ర వ్యాపార రంగంలో రష్యా కీలక పాత్ర పోషించగలదన్నారు. మరోవైపు, రష్యా చమురు, గ్యాస్ రంగంలో భారతీయ కంపెనీలు మరింతగా పాలుపంచుకోవాలని పుతిన్ చెప్పారు. భారతీయ కంపెనీలు రష్యాలో ఇన్వెస్ట్ చేయడానికి అడ్డంకులను తొలగించడంపైనా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
రష్యా సంస్థతో రిలయన్స్ డిఫెన్స్ జట్టు
మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్.. రష్యా ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం అల్మాజ్‌యాంటేతో గురువారం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్ రక్షణ దళాలకు అవసరమైన మొత్తం ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్(క్షిపణులు), రాడార్ సిస్టమ్స్‌ను ఇరు సంస్థలు కలిసి తయారు చేయనున్నాయి. ఇప్పటికే అల్మాజ్‌యాంటే అభివృద్ధి చేసిన ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసే ప్రణాళికల్లో భారత్ ఉంది. ఈ కొనుగోలు విలువ దాదాపు రూ.40 వేల కోట్లుగా అంచనా. రిలయన్స్ డిఫెన్స్ .. అడాగ్ గ్రూపునకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ.
ఓవీఎల్, రాస్‌నెఫ్ట్ ఒప్పందం..
రష్యాలోని రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15% వాటాల కొనుగోలు ప్రక్రియలో తొలి దశ పూర్తి సందర్భంగా రాస్‌నెఫ్ట్‌తో ఓఎన్‌జీసీ విదేశ్(ఓవీఎల్) కన్ఫర్మేషన్ డీల్ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఓవీఎల్ ఎండీ నరేంద్ర కే వర్మ, రాస్‌నెఫ్ట్ చైర్మన్ ఐగర్ సెచిన్ ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 1.26 బిలియన్ డాలర్లు వెచ్చించి వాంకోర్‌లో ఓవీఎల్ 15% వాటా కొనుగోలు చేస్తోంది.