సేవింగ్స్ వడ్డీరేట్లకు మరో రెండు బ్యాంకుల కోత
పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పొదుపు ఖాతాలపై అరశాతం కట్
న్యూఢిల్లీ: దిగ్గజ ఎస్‌బీఐ తదితర బ్యాంకుల బాటలోనే తాజాగా పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పొదుపు ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను అరశాతం తగ్గించాయి. రూ. 50 లక్షల దాకా బ్యాలెన్స్ ఉండే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 3.50 శాతం తగ్గిస్తున్నట్లు పీఎన్‌బీ తెలిపింది. అలాగే వివిధ మెచ్యూరిటీలకు సంబంధించి రూ. 1 కోటి దాకా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును 15–40 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వివరించింది.
అటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గిస్తున్నట్లు, రూ. 50 లక్షల పైగా బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై యథాప్రకారం 4 శాతం వడ్డీ రేటు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రెండు బ్యాంకులు సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నింటికన్నా ముందుగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపునకు ఎస్‌బీఐ శ్రీకారం చుట్టింది. అర శాతం తగ్గించి 3.5 శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, బీఓబీ కూడా రూ. 50 లక్షల్లోపు ఖాతాలపై ఇదే బాటలో 3.5% వడ్డీ రేటు ఖరారు చేశాయి.