
సాక్షి, ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. భారీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బీపీఎస్ పాయింట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఇటీవల వడ్డీరేట్లపెంపును ప్రకటించిన నేపథ్యంలో పీఎన్‌బీ కూడా వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది.
దేశీయ బల్క్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 4.5 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. కోటి రూపాయలు, ఆపైన ఒక సంవత్సరం,అంతకుపైన టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీరేటును వర్తింప చేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ఒకప్రకటనలో తెలిపింది. కోటి రూపాయల డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు 100 బేసిస్ పాయింట్లను పెంచిన సంగతి తెలిసిందే.